అధికారంలోకి రాగానే భూముల స్వాధీనం

అధికారంలోకి రాగానే భూముల స్వాధీనం

  తెలుగుదేశం  పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెసు పార్టీ నేతలు కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు  ఆదివారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యాపారం చేస్తోందని బాబు అన్నారు. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రమణ బినామీ పేర్లతో భూములు కబ్జా చేశారని ఆరోపించారు.

తిరుపతి- తిరుచానూరు ప్రధాన మార్గం వెంట వెంకట రమణ కబ్జా చేసినట్లుగా చెబుతున్న భూములను బాబు ఆదివారం పరిశీలించారు. అక్కడి ప్రజలను, మాజీ సర్పంచిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతి శివార్లలో ఉన్న భూముల రికార్డులను తారుమారు చేసి కబ్జా చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం భూములతో పాటు పేదల భూములను కూడా కాంగ్రెసు నేతలు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారన్నారు. అనంతరం చంద్రబాబు తిరుపతి నుండి హైదరాబాదుకు బయలు దేరి వెళ్లారు.

కాగా శనివారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో వెలసిన ఇఫ్కో కిసాన్ సెజ్‌లో గ్రీన్‌పోర్టు పేరిట జగన్ రూ. 40 కోట్లు కొట్టేశాడని చంద్రబాబు ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల టిడిపి కార్యకర్తలతో వేర్వేరుగా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెజ్ కోసం 2,776 ఎకరాలను సేకరించారన్నారు. 

ఈ సెజ్‌లో గ్రీన్‌పోర్టు కంపెనీ పాడి, పౌల్ట్రీ తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పి 40శాతం వాటాలు తీసుకుందన్నారు. సెజ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 40 కోట్లు విడుదల చేసిందని.. గ్రీన్‌పోర్టు జగన్ బినామీ కంపెనీ కావడంతో ఆ రూ.40 కోట్లను జగన్ కొట్టేశాడని ఆరోపించారు. దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వెలువడ్డాయన్నారు. ప్రతి ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, ఉద్యోగాలు ఇవ్వనందున ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.