మోహన్‌ బాబు కోసం రంగంలోకి బాలకృష్ణ

మోహన్‌ బాబు కోసం రంగంలోకి బాలకృష్ణ

 రాజకీయ పార్టీలకు సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు. ఆయనను తమ తమ పార్టీలలోకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబును తన వైపుకు తీసుకు వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేశారని అంటున్నారు.

జగన్ ఇటీవల మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశారు. కేవలం బంధుత్వ పరంగా కలిశారని ఇరువురు కొట్టిపారేసినప్పటికీ అతనిని తన పార్టీలోకి ఆహ్వానించేందుకే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వెళ్లారని చెబుతున్నారు. తెలుగదేశం, వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్న మోహన్ బాబును తన వైపుకు రప్పించుకునేందుకు కాంగ్రెసు పార్టీ కూడా ఓ రాయి వేసి చూసింది. ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో సంబంధమున్న రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి కూడా మోహన్ బాబును నెల్లూరులో తన వైపుకు ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంలో భాగంగా ఆయనను తన కళా పరిషత్ ద్వారా నటవాచస్పతిచే గౌరవించారు.

తాను రాజకీయాలలోకి వస్తానని ప్రకటించిన అనంతరం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పొగడ్తల వర్షం కురిపించిన మోహన్ బాబు ఆ పార్టీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అతను జగన్, కాంగ్రెసుతో చెట్టాపట్టాలేసుకోవడం టిడిపికి రుచించలేదట. ఆయనను టిడిపిలోనికి రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకు బాబు తన బావమరిది, నందమూరి హీరో బాలకృష్ణను ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ, మోహన్ బాబులు ఒకే రంగానికి చెందిన వారు. దీంతో వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా మోహన్ బాబు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు పిచ్చ అభిమాని. ఒకవిధంగా చెప్పాలంటే నందమూరి హీరోలకంటే ఎన్టీఆర్ పేరు తలుచుకునేది మోహన్ బాబే అని చెప్పవచ్చు.  బాలకృష్ణ  స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు. దీంతో ఒకరిపై మరొకరికి గౌరవం, అభిమానం ఉన్నాయి.

వారి మధ్య ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో  మోహన్ బాబు ను తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు బాలయ్యచే రాయబారం నెరపాలని టిడిపి నేతలు భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య ఇందుకు ఒప్పుకుంటారా లేదా అనే చర్చ కూడా నేతల మధ్య జరుగుతున్నట్లుగా సమాచారం.