జగన్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

 జగన్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

 తనను అరెస్టు చేస్తారని, ఆ తర్వాత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు అల్లర్లు సృష్టించి ఉప ఎన్నికలను వాయిదా వేయిస్తాయంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి  కౌంటర్ వేశారు. ముఖ్యమంత్రిని దించి ఆ సీటులో తాను కూర్చునేందుకు హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి నరమేధం సృష్టించిన చరిత్ర మీ నాన్నది కాదా అని ప్రశ్నించారు.

తెలుగువాడు ప్రధాని అయి రాష్ట్రానికి వస్తే ఆయనపై చెప్పులు వేయించింది మీరు కాదా అని మండిపడ్డారు. హత్యా రాజకీయాల చరిత్ర మీదా.. మాదా అన్నారు. కుట్రలు, కుతంత్రాలు జగన్ ఇంటి పేరు అని, అవినీతి, హత్యా రాజకీయాలు అతడి సొంతపేరన్నారు. జగన్‌పై సిబిఐ చేయివేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటూ ఆయన అల్లరిమూకే ప్రకటనలు చేసిందని గుర్తుచేశారు. ఒక విదేశీ వెబ్‌సైట్‌లో వైయస్ మరణం గురించి వచ్చిన వార్తను పట్టుకొని రాష్ట్రంలో జగన్ అనుచరగణం నానా బీభత్సం సృష్టించిందన్నారు.

జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకొనేది కోర్టులు తప్ప పార్టీలు కాదన్నారు. జగన్ అరెస్టుతో ప్రయోజనం లేదన్నది మా అభిప్రాయమని, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకొని పేదలకు పంచితేనే నిజమైన ప్రయోజనం సిద్ధిస్తుందన్నారు. జగన్ తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కుట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

జగన్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు పథక రచన చేసినట్టు ఉందని, అందుకే ఆ నిందను జగన్ మిగతా పార్టీలకు ఆపాదిస్తున్నాడని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లా రావు విమర్శించారు. మరోవైపు జగన్ ఆరోపణలు అతడి అవివేకానికి నిదర్శనమని మండలి విపక్షనేత నేత దాడి వీరభద్ర రావు వ్యాఖ్యానించారు.

వైయస్ జగన్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చినా అరెస్టు చేయలేదని, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్‌పై ఆరోపణ రావడం ఆలస్యం అరెస్టు చేసి జైల్లో పెట్టారని టిడిపి ఉపాధ్యక్షుడు పెద్ది రెడ్డి విమర్శించారు. జగన్‌కో న్యాయం... పాల్‌కో న్యాయం ఏమిటని ప్రశ్నించారు. పాల్ తప్పుచేస్తే ఆయనపై చట్ట ప్రకారం చర్యకు తాము వ్యతిరేకం కాదన్నారు.

అయితే, ఆయన విషయంలో ఎక్కడా లేనంత తొందర కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇందులో జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్ముక్కయ్యారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఈసి కూడా దర్యాప్తు చేయాలన్నారు.