జగన్ సానుభూతిపై అవినీతి బాణం

జగన్ సానుభూతిపై అవినీతి బాణం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నేతల విమర్శల దాడి రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు  బొత్స , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్ని పార్టీలకు ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్య అయిన ప్రస్తుత పరిస్థితుల్లో కనీస స్థానాలలోనైనా గెలుపొందాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు, టిడిపిలు జగన్ అవినీతిపరుడు అంటూ ప్రజల ముందుకు ధాటిగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సిబిఐ విచారణ నేపథ్యంలో జగన్ పైన ప్రజల సానుభూతి క్రమంగా తగ్గుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ తమ పార్టీలో గెలుపు కోసం టిడిపి, కాంగ్రెసు జగన్ పైన సానుభూతిని మరింత తగ్గించేందుకు అవినీతి విల్లును సానుభూతికి ధీటుగా ఎక్కుపెడుతున్నాయి. ఎలాగైనా జగన్‌ను ఈ ఉప ఎన్నికలలో సాధ్యమైనంత తక్కువ స్థానాలు గెలుచుకునేలా ఆ పార్టీలు వేటికవే వ్యూహాలు రచిస్తున్నాయి.

ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ జగన్‌పై ఉన్న సానుభూతి దృష్ట్యా ఆయన పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. జగన్ పైన ముఖ్యమంత్రి కిరణ్ తన దాడిని రోజు రోజుకు పెంచుతున్నారు. నల్ల జీవోలు జారీ చేశారన్న జగన్ వ్యాఖ్యలపై కిరణ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. తండ్రిని ప్రభావితం చేసి టేబుల్ కింద సంతకాలు పెట్టించావు కాబట్టే నీపై సిబిఐ దర్యాఫ్తు వచ్చిందని, నీ సంస్థలలోకి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని సిబిఐ అడుగుతోందని, ముందు దానికి సమాధానం చెప్పమని గుంటురు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అక్రమంగా డబ్బు సంపాదించిన వారి ఖాతాల అటాచ్‌మెంట్ కోసం సిబిఐ కోరితే, కాన్ఫిడెన్షియల్ డివో ప్రకారం ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. సిఎం పదవి రాలేదన్న దుగ్ధతోనే జగన్ సొంత పార్టీ పెట్టుకొని కాంగ్రెసును, ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనుకోవడం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేసింది నీతి పనా అని ప్రశ్నించారు. జగన్ వర్గం నేతలు చేసింది త్యాగం కాదని, జ్ఞానం లేని పని అని మండిపడ్డారు.

వైయస్‌కు అబద్దాలు చెప్పే అలవాటు లేదని, ఉన్నది నేరుగా ముఖం మీద చెప్పేవారని, కానీ జగన్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్దంగా ఉన్నారన్నారు. సాక్షిలో వచ్చేవన్నీ పచ్చి అబద్దాలన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సత్యం ఆస్తుల పైనా అలాంటి జివో కింద అటాచ్‌మెంట్ ఉత్తరువులు వచ్చాయని, అంటే వైయస్ కూడా బల్ల కింద సంతకం పెట్టారా అని ప్రశ్నించారు. తనకు టేబుల్ కింద దూరాల్సిన అవసరం లేదన్నారు.

స్వార్థం, స్వలాభం కోసం, ప్రజాస్వామ్యాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు, డబ్బు మదంతో అధికారం దక్కించుకొని, రాష్ట్రాన్ని ఇంకా దోచుకునేందుకు దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటికి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పి కనువిప్పు కలిగించారని బొత్స మండిపడ్డారు. కిరణ్ కంటే ఓ అడుగు ముందుకేసి జగన్‌ను ఎందుకు అరెస్టు చేయవద్దని బొత్స ప్రశ్నించారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినందుకు తాము చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రభుత్వ ఆస్తులను ఏవిధంగా ధారాదత్తం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కిరణ్, బొత్స.. జగన్ పైన పోటా పోటీగా విమర్శలు చేస్తున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొదటి నుండి జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కుంభకోణం చూసినా, అవినీతి వ్యవహారం చూసినా, నేర సంఘటనలు చూసినా వాటికి మూలం వైయస్ జగనే అంటూ మండిపడుతున్నారు. పారిశ్రామికివేత్తలు, అధికారులు జైళ్లకు వెళుతుంటే అందుకు కారకుడైన జగన్ మాత్రం బయట ఉంటున్నారన్నారు.