మీడియాపై జగన్ చిందులు

మీడియాపై జగన్ చిందులు

 మీడియాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్  జగన్మోహన్ రెడ్డి  తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. మీడియా కెమెరామెన్‌పై ఆయన శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చావు మీరు చావండంటూ మీడియా ప్రతినిధులపై ఆయన చిందులేసినట్లు చెబుతున్నారు. కాగా, వైయస్ జగన్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమామళికి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ జగన్ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను వెనక్కి పంపించారు. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల పక్షాన నిలబడిన 18 మంది శాసనసభ్యులకు ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర నాయకులు పాలించడం లేదని, ఢిల్లీ పెద్దలు పాలిస్తున్నారని ఆయన అన్నారు. పేదల పక్షాన నిలిచిన చెన్నకేశవ రెడ్డికి అండగా నిలబడాలని ఆయన ప్రజలను కోరారు. 

ప్రభుత్వం పేదవాడి బాధలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో త్వరలో 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ప్రజలు వేసే ఓట్లు పేదవాడికి, రైతన్నకు అండగా నిలవాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నడిపిస్తున్న కాంగ్రెసు పెద్దలకు కనువిప్పు కలిగేలా ఉండాలని ఆయన అన్నారు. 

ఉప ఎన్నికలు జరుగుతున్న శానససభా నియోజకవర్గాల్లో వైయస్ జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన శనివారం కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో ఆయన తన పర్యటనను పూర్తి చేసుకున్నారు.