ఫెరారీకి సవారిలో...జూనియర్ సచిన్!

ఫెరారీకి సవారిలో...జూనియర్ సచిన్!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ త్వరలో బాలీవుడ్ తెరంగ్రేటం చేయబోతున్నారని, విధు వినోద్ చోప్రా రూపొందిస్తున్న ‘ఫెరారీ కి సవారి' చిత్రంలో సచిన్ నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్స సంగతి తెలిసిందే. దర్శకుడు విధు వినోద్ చోప్రా తరచూ సచిన్‌తో సంప్రదింపులు జరుపడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. 

అయితే సచిన్ తెరంగ్రేటం వార్తలన్నీ తాజాగా అవాస్తవమని తేలింది. ఈచిత్రంలో కేవలం సచిన్ పేరు మాత్రమే వాడుకుంటున్నామని దర్శకుడు విధు వినోద్ చోప్రా తెలిపారు. ఈ చిత్రంలో సచిన్ చిన్న తనంలో ఎలా ఉన్నాడో అలాంటి ఓ చైల్డ్ యాక్టర్ నటిస్తున్నాడని, అతన్ని అందరూ జూనియర్ సచిన్ అని పిలుస్తారని చెప్పారు. జూనియర్ సచిన్ ప్రదర్శించే క్రికెటింగ్ టాలెంట్స్ అందరినీ ఆకట్టుకుంటాయని దర్శకుడు చెప్పుకొచ్చారు.

సచిన్‌కున్న బ్రాండ్ వేల్యూ దృష్ట్యా ఆయన అనుమతి తీసుకొని ప్రోమోను ప్రదర్శించబోతున్నామని నిర్మాత విధు వినోద్ చోప్రా తెలిపాడు. ‘అంతకుముందు ఉన్న ప్రమోషన్లో ఓ సన్నివేశంలో సంజయ్‌దత్ పేరు ప్రస్తావనకు వస్తుంది. తాజాగా విడుదల చేయబోతున్న ప్రోమోస్‌లో సంజయ్‌దత్ స్థానంలో సచిన్ పేరును జత చేశాం' అని ఆయన అన్నారు.

అయితే యూనిట్ సభ్యుల వాదన వేరేలా ఉంది. ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో సచిన్‌ను నటింపజేయడానికి విధువినోద్ చోప్రా ప్రయత్నాలు మొదలుపెట్టారని, సచిన్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆయన తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చిత్ర వర్గాలు అంటున్నారు.