ఎన్‌సిటిసిపై వెనక్కి తగ్గిన కేంద్రం

ఎన్‌సిటిసిపై వెనక్కి తగ్గిన కేంద్రం

 ఎన్‌సిటిసిపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. శనివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయం సాధించడంలో ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి పి. చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు దాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. యుపిఎ భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్‌సిటిసిని వ్యతిరేకించారు. 

మమతా బెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్‌సిటిసిని వ్యతిరేకిస్తూ తమ వాదనలను వినిపించినప్పుడు మన్మోహన్ సింగ్, చిదంబరం మౌనంగా వింటూ పోయారు. ఎన్‌సిటిసిని తేవాలనే ఆలోచన రాష్ట్రాల హక్కులను కాలరాయడానికేనని కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదించారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై నిప్పులు చెరిగారు. మన్మోహన్ సింగ్, చిదంబరం ముఖ్యమంత్రులను అపోహలను తొలగించడంలో విఫలమయ్యారనేది కొద్ది గంటల్లోనే తేలిపోయింది. రాష్ట్రాల హక్కులను హరించే ఉద్దేశం ఎన్‌సిటిసిని తేవాలనే ఆలోచనలో లేదని, కేవలం ఉగ్రవాదంపై సమన్వయ పోరుకు మాత్రమే తేవాలని అనుకుంటున్నామని మన్మోహన్ సింగ్ చెప్పారు.

ప్రధాని, హోం మంత్రి మాటలపై మమతా బెనర్జీ గానీ ఇతర ముఖ్యమంత్రులు గానీ విశ్వాసం ప్రకటించలేకపోయారు. ఎన్‌సిటిసిలోలోని లోపాలను ఎత్తిచూపుతూ జయలలిత రాష్టాలను చదరంగంలో పావులుగా వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్‌సిటిసి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిష్టకు వెళ్లకుండా ఎన్‌సిటిసిని ఉపసంహరించుకోవాలని నరేంద్ర మోడీ కోరారు. ప్రస్తుత రూపంలో ఎన్‌సిటిసిని అంగీకరించలేమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎన్‌సిటిసిలోని కొన్ని క్లాజ్‌లు దుర్వినియోగం కావనే గ్యారంటీ ఏమీ లేదని ఆయన అన్నారు. 

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఎన్‌సిటిసిని వ్యతిరేకించారు.