వైయస్ఆర్ లేకపోవడం ఇబ్బందే

వైయస్ఆర్ లేకపోవడం ఇబ్బందే

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం ఇబ్బందే అని, అయినప్పటికీ ఆ లోటును భర్తీ చేస్తామని  కేంద్రమంత్రి వాయలార్ రవి  శుక్రవారం అన్నారు. ఆయన గాంధీ భవనంలో కాంగ్రెసు పార్టీ సమన్వయకర్తలతో గాంధీ భవనంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి రవి దిశా నిర్దేశనం చేశారు.

నియోజకవర్గానికి ఇద్దరు పరిశీలకులను నియమించారు. వైయస్ వంటి నేత లేకపోవడం కాస్త ఇబ్బందే అయినప్పటికీ భర్తీ చేస్తామన్నారు. అయితే పార్టీకి మంచి కార్యకర్తలు ఉన్నారన్నారు. గెలుస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సమన్వయకర్తలకు రవి సూచించారు. బూత్ స్థాయి కమిటీలు చురుగ్గా పని చేయాలన్నారు. ఒకటి రెండు సీట్లు పోయినా మంచి మెజార్టీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పరిశీలకులు ప్రచారాన్ని సమన్వయపర్చుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పారు. ప్రచారానికి జాతీయస్థాయి నేతలు వస్తారన్నారు. ఈ నెల 20వ తారీఖున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి తాను పరకాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.

కాగా అంతకుముందు వాయలార్ రవితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. అంగోలాలో మన రాష్ట్ర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వాయలార్ రవి సానుకూలంగా స్పందించారని అంగోలాలో కార్మికులను వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని వాయలార్ హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం నారాయణ తెలిపారు.