'షారుఖ్'కు అండగా నిలిచిన దీదీ

'షారుఖ్'కు అండగా నిలిచిన దీదీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖెడ్ స్టేడియంలోకి షారుఖ్ ఖాన్‌ని ఐదేళ్లు నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై తిరిగి పునఃరాలోచించాల్సిందిగా కోరారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ మేము మహారాష్ట్రని ఎంతగానో అభిమానిస్తాం. బిజినెస్ పరంగా ఇండియాలో ముంబై రాజధాని నగరంగా ఉన్న విషయం తెలిసిందే. 

సచిన్ టెండూల్కర్ నుండి షారుఖ్ ఖాన్ వరకు అందరిని మేము అమితంగా అభిమానిస్తాం. షారుఖ్ ఖాన్ కోల్‌కత్తాకి బ్రాండ్ అంబాసిడర్. ఈ విషయంపై నేను వ్యాఖ్యలు చేయడం సరైనదో లేదో తెలీదు. ఈ విషయం చాలా సున్నితమైంది. కొన్ని మానసిక కోణాలను దృష్టిలో పెట్టుకోని వారి నిర్ణయాన్ని తిరిగి పునఃరాలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నాకు తెలిసి అక్కడ అపార్ధం జరిగి ఉంటుందని అన్నారు. 

బాలీవుడ్ కింగ్ ఖాన్, కోల్ కత్తా నైట్ రైడర్స్ సహా యజమాని షారుఖ్ ఖాన్‌‌ని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఐదేళ్ల పాటు వాంఖెడ్ స్టేడియంలోకి అడుగు పెట్టకుండా నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. షారుక్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. కావాలంటే తమ సెక్యూరిటీ సిబ్బందిపై షారుక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. నిషేధంపై పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొదట అతనిపై జీవితకాల నిషేధం విధించాలని అనుకున్నా.. చివరికి ఐదేళ్ల పాటు వాంఖడేలో అడుగుపెట్టకుండా నిషేధించాలని నిర్ణయించారు. 

ఇక వివరాల్లోకి వెళితే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడ్డాడని అతడిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ సిబ్బంది మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో షారుఖ్ ఖాన్‌పై 320, 506 కేసులను పోలీసులు నమోదు చేశారు.

బుధవారం మ్యాచ్ ముగిసిన అనంతరం షారుఖ్ కొంతమంది చిన్నారులతో కలిసి మైదానంలోకి వచ్చాడు. అభ్యం తరం చెప్పిన సిబ్బందిపై చేయి చేసుకోవడంతోపాటు ఎంసీఏ, బోర్డు అధికారులను దుర్భాషలాడాడు. ఈ సమయంలో షారుఖ్ మద్యం తాగి ఉన్నాడని, భద్రతా సిబ్బందితోపాటు ఎంసీఏ అధ్యక్షుడు విలాస్ రావ్ దేశ్‌ముఖ్, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగినట్టు ఎంసీఏ కోశాధికారి రవి సావంత్ ఆరోపించారు.

కోల్ కత్తా నైట్ రైడర్స్ సహా యజమాని ముంబై వాంఖెడ్ స్టేడియంలో జరిగిన విషయంపై నోరు విప్పారు. వాంఖెడ్ స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు చిన్న పిల్లల పట్ల ప్రవర్తించిన తీరు తనకు కోపం తెప్పించిందని.. ఆ సందర్బంలో వారితో గొడవ పడడం తప్పేమి కాదని తనని తాను సమర్దించుకున్నాడు. అసలు నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు ఏమీ చేయలేదని.. ముంబై సిబ్బందే తనకు క్షమాపణ చెప్పాలని అన్నాడు.

నేను నిన్న రాత్రి మద్యం తాగి గొడవ చేశానంటూ వస్తున్న ఆరోపణలలో నిజం లేదని.. అసలు నేను మద్యం తాగి లేనని షారుఖ్ స్పష్టం చేశాడు. నాతో పాటు పిల్లలు అందరం స్టేడియంలో ఒక ప్రక్కన కూర్చోని మ్యాచ్‌ని తిలకిస్తున్నామని.. ముంబై క్రికెట్ అసోసియేషన్ సిబ్బంది చిన్న పిల్లలతో దురుసుగా ప్రవర్తించడం వల్లనే తాను కోపాద్రిక్తుడయ్యానని.. ఈ విషయంపై వారే నాకు క్షమాపణలు చెప్పాలని అన్నాడు.

ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు, పోలీసులు ప్రవర్తించిన తీరు ఇదే విధంగా ఉంటే మరెన్నడూ నేను వాంఖెడ్ స్టేడియంలో అడుగు పెట్టనని అన్నాడు. భద్రత పేరుతో చిన్న పిల్లలపై చేయిచేసుకోవడం ఎంతవరకు సమంజసమని షారుఖ్ ప్రశ్నిం చాడు. ఈ ఉదంతంపై సీరియస్‌గా ఉన్న ముంబై క్రికెట్ అసోసియేషన్ శుక్రవారం అత్యవసర సమావేశమై ఐదు సంవత్సరాల పాటు షారుఖ్‌ను వాంఖడేలోకి అనుమతించకూడదంటూ ముంబై క్రికెట్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.