సూరీడు ని జగన్ కేసులో సిబిఐ విచారణ

 సూరీడు ని జగన్ కేసులో సిబిఐ విచారణ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసుతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరుగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడును సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. సూరీడుని ఆ రెండు కేసుల్లో సాక్షిగా సిబిఐ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. సూరీడు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిబిఐ కోర్టుకు సమర్పించడానకి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. 

సూరీడిని ఇంతకు ముందు ప్రశ్నించిన సిబిఐ మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధపడుతోంది. మెజిస్ట్రేట్ ఎదుట సూరీడు వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సిబిఐ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు వైయస్ రాజశేఖర రెడ్డి నమ్మినబంటు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాకుండా క్యాంప్ కార్యాలయంలో ఏం జరిగిందనే విషయం సూరీడికి కచ్చితంగా తెలిసి ఉంటుందని భావిస్తున్నారు. 

సూరీడిని సిబిఐ అధికారులు కీలక సాక్షిగా పరిగణిస్తున్నారు. సూరీడు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఎల్లవేళలా ఆయన వైయస్ రాజశేఖర రెడ్డిని అంటి పెట్టుకుని ఉండేవారు. అయితే,  వైయస్ జగన్ ‌కు వ్యతిరేకంగా సూరీడు సాక్ష్యం ఇచ్చారనే తెలుగు టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు సూరీడు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

జగన్ ఆస్తుల కేసులో, ఎమ్మార్ కేసులో కీలక విషయాలను విచారణలో వెల్లడించిన సూరీడు తర్వాత మాట మార్చే అవకాశం ఉంటుందనే ముందు జాగ్రత్తగా మెజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సిబిఐ భావిస్తున్నట్లు సమాచారం.  వైయస్ రాజశేఖర రెడ్డి  మరణం తర్వాత సూరీడు అంతగా జగన్ వెంట కనిపించలేదు. ఆయన జగన్‌కు దూరమైనట్లే భావిస్తున్నారు. సూరీడి కుటుంబంలో జరిగిన ఓ కార్యక్రమానికి జగన్ హాజరు కాలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. చాలా రోజుల క్రితమే సూరీడు కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరైనట్లు వార్తలు వచ్చాయి.