జగన్ వద్దకు వైయస్ వివేకా

జగన్ వద్దకు వైయస్ వివేకా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డిని  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి గురువారం కలిశారు. వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గుంటూరుకు వచ్చిన వైయస్ వివేకా జగన్‌తో లక్ష్మీపురంలో భేటీ అయ్యారు. ఆయన జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

అందుకోసమే జగన్‌ను వివేకా కలిసినట్లుగా సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తట్టుకోలేక తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైయస్ వివేకానంద రెడ్డి బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో సమావేశమై, వారి నిర్ణయం మేరకు కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పారు.

తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైయస్ వివేకానంద రెడ్డి బుధవారం చెప్పారు. పార్టీ కార్యకర్తలతో, వైయస్ అబిమానులతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తుండడాన్ని తాను సహించలేకపోతున్నానని, తాను కాంగ్రెసుకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు అంకిత భావంతో పనిచేసినా తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో నిర్ణయించుకుంటానని ఆయన చెప్పారు.

తనకు కాంగ్రెసులో ఉండాలనిపించడం లేదన్నారు. పార్టీ కోసం కుటుంబాన్ని వదిలేసినప్పటికీ తనకు కాంగ్రెసులో ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ను అందరూ దోషిగా చేసి మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించమని కార్యకర్తలను కోరానని అన్నారు.

వైయస్ ఉన్నన్నాళ్లూ కాంగ్రెసు అభివృద్ధికి పాల్పడ్డారన్నారు. ఆయన చనిపోయాక నిత్యం ఆయన పైనే విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రులు విమర్శలు చేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం స్పందించడం లేదన్నారు. వైయస్ కుటుంబంపై కాంగ్రెసు కక్ష సాధిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అలాంటి పార్టీలో తాను ఎందుకు కొనసాగాలన్నారు