చిరు కి సెల్యూట్ చేసి వాడిని :జగన్

చిరు కి సెల్యూట్ చేసి వాడిని :జగన్

ఏఐసిసి అధ్యక్షురాలు  సోనియా గాంధీ తనకు ప్రమోషన్ ఇచ్చిందంటూ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తిరుపతి ప్రజలను గాలికొదిలేసి న్యూఢిల్లీ వెళ్లారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. వైయస్ జగన్ బుధవారం తిరుపతి నియోజకవర్గంలో రెండో రోజు తన ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన చిరంజీవిపై మరోమారు నిప్పులు చెరిగారు. తిరుపతిలో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చిరంజీవి ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తిరుపతిని కాదని ఆయన హైదరాబాదులో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఉండేందుకు అంగీకరించారని ధ్వజమెత్తారు. మండు వేసవిలో తాగేందుకు మంచినీళ్లు దొరక్క అల్లాడుతున్న అక్కచెల్లెళ్ల కోసం చిరంజీవి  పదవి త్యాగం చేసి ఉంటే తాను సెల్యూట్ చేసే వాడినని అన్నారు. జగన్ తిరుపతి ఆటో నగర్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో రైతన్న రాజ్యం రావాలంటే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడు వేసే ఓటు ద్వారా ఆ పార్టీలకు కనువిప్పు కలగాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఉప ఎన్నికలు రాష్ట్రంలో జరగబోయే మార్పులకు నాంది కావాలని ఆయన అన్నారు. పేదవాడు, రైతుల దుస్థితికి ఈ ఎన్నికలు అద్దం పట్టాలన్నారు. ఢిల్లీ రిమోట్ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని, అందుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

కాగా  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ కర్నూలు జిల్లా నేత భూమా నాగి రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. చంద్రబాబు ముఠాలు నడిపి ముఖ్యమంత్రి కాలేదా అని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆళ్లగడ్డలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అందుకు బాబు నిరాకరిస్తే తానే కుప్పం నుంచి ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అప్పుడు గెలుపు ఎవరిదో తేల్చుకుందామన్నారు.