జగన్ శ్రీవారి దర్శనం వివాదాస్పదం

జగన్ శ్రీవారి దర్శనం వివాదాస్పదం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం వివాదాస్పదమైంది. వైయస్ జగన్ బుధవారం ఉదయం కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వైయస్ జగన్ అనుచరులు పలువురు ఆలయంలోని మహాద్వారం వద్ద జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్నారు.

ఆ తర్వాత  శ్రీవారి ర్శనం  కోసం వచ్చే అన్యమతస్థులు తమ సమ్మతిని తెలిజయేస్తూ డిక్లరేషన్ ఫారంలో సంతకం చేయాల్సి ఉన్నప్పటికీ జగన్ సంతకం చేయలేదు. 2009వ సంవత్సరంలోనే శ్రీవారిని దర్శించుకున్న జగన్ అప్పుడు డిక్లరేషన్ ఫారంపై సంతకం చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్‌కు డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి అధికారులు 17వ నంబర్ కంపార్టుమెంట్ వద్ద నిరీక్షించినప్పటికీ అతను పట్టించుకోలేదట.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం అన్యమతస్థులు శ్రీవారిని దర్శించికున్న ప్రతిసారి డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాల్సిందేనని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రతిసారి సంతకం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒకసారి సంతకం చేస్తే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, ప్రతిసారి చేయాల్సిందేననే రెండు వాదనలు వినిపించడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.

అంతకుముందు వైయస్ జగన్ కాన్వాయ్ నిర్దేశించిన హద్దులు దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో నిఘా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలకు వెళ్లనివ్వమని చెప్పారు. దీంతో జగన్ అక్కడే దిగి లోనికి వెళ్లారు. కాగా డిక్లరేషన్ ఫారంపై జగన్ సంతకం పెట్టక పోవడాన్ని భక్తులు తప్పు పడుతున్నారు. సంతకం పెట్టకుండానే శ్రీవారిని దర్శించుకున్న జగన్‌పై చర్యలు తీసుకోవాలని శ్రీరాం సేన డిమాండ్ చేసింది.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి ద్వారా ఆయన బుధవారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకునేందుకు వైయస్ జగన్ మంగళవారం రాత్రి తిరుమలకు వచ్చారు. ఆయన శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేశారు. జగన్‌తో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జగన్‌తో పాటు వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.