సాక్షిని మూయించడమే లక్ష్యం

సాక్షిని మూయించడమే లక్ష్యం

: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డికి  చెందిన సాక్షి దిన పత్రిక , టివిని మూయించడమే సిబిఐ లక్ష్యంగా కనిపిస్తోందని సాక్షి తరఫు న్యాయవాది గురువారం సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదించారు. తమ బ్యాంక్ అకౌంట్లను సిబిఐ స్తంభింప చేయడంపై సాక్షి కోర్టు కెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ గురువారం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఇరువర్గాలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి.

సాక్షిని మూయించడమే సిబిఐ లక్ష్యంగా ఉందని సాక్షి తరఫు న్యాయవాది అన్నారు. 102వ సెక్షన్‌ను వక్రీకరించారన్నారు. ఖాతాల స్తంభన అసంబద్దమైన చర్య అని, కోర్టు అనుమతులు లేకుండా ఎలా ఫ్రీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఇది రాజకీయ కోణంలోనే జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను కట్టడి చేసేందుకు సిబిఐ దీనిని అస్త్రంగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు.

సిబిఐ పరిధి తరఫు వ్యవహరిస్తోందని, దీని వల్ల ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారని సాక్షి న్యాయవాది తెలిపారు. ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జీషీటులలో తాము రూ.74 కోట్లను గుర్తించామని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. అవసరమనుకుంటే సాక్షి యాజమాన్యం కొత్తగా అకౌంట్లను తెరిచి లావాదేవీలు జరుపుకోవచ్చునని సూచించింది. ఇది చాలా పెద్ద కుంభకోణమని, అతి తక్కువ కాలంలో విచారణ పూర్తి చేయడం కుదరదని తెలిపింది.

అయితే సాక్షి ఖాతాలకు తాము బ్యాంక్ గ్యారెంటీ ఇస్తామని, తమ అకౌంట్లను తెరిపించాలని సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణంలో జగన్ పైన కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. తమ అకౌంట్లలోకి సిబిఐ చెబుతున్న భారీ మొత్తంలో లావాదేవీలు జరగలేదన్నారు. అక్రమాలు జరిగాయని భావిస్తే, అందుకు సంబంధించిన జివోలు ఎందుకు రద్దు చేయలేదన్నారు. సంబంధించిన మంత్రులను, అధికారులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాగా ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును 14వ తారీఖుకు వాయిదా వేసింది.