నేను అరెస్టయితే అమ్మే చూసుకుంటారు

నేను అరెస్టయితే అమ్మే చూసుకుంటారు

 తన అరెస్టుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెరిపి లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. తాను అరెస్టయితే పార్టీ బాధ్యతలను అమ్మే చూసుకుంటారని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన గురువారం ఈ విషయం చెప్పారు. వైయస్ జగన్ అరెస్టయితే పులివెందుల శాసనసభ్యురాలు, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకుంటారని జగన్ ప్రకటనను బట్టి స్పష్టమైంది.

తన అరెస్టుకు ఢిల్లీ నుంచి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల హంగామా చూస్తుంటే కుట్ర అర్థమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తన మీద వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను వాయిదా వేయించడమే వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒక్క చోట కూడా విజయం సాధించలేవని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, ముందస్తు బెయిల్ కోసం వైయస్ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25వ తేదీ శుక్రవారం జగన్ సిబిఐ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగానే వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అభిప్రాయంతో  వైయస్ జగన్ ఉన్నట్లు అర్థమవుతోంది. దానివల్లనే ఆయన తన అరెస్టు గురించే రెండు మూడు రోజుల నుంచి ప్రకటనలు చేస్తున్నారు. 

పొరుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారికి వేలాది ఎకరాల భూములను ఇస్తూ.. అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని, ఇదే విధానాన్ని వైయస్ అనుసరిస్తే దానిని భూఆక్రమణల నేరంగా పరిగణిస్తున్నారని జగన్ బుధవారం అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో గోల్ఫ్‌కోర్స్‌కు చంద్రబాబు 535 ఎకరాలను కారుచౌకగా ధారాదత్తం చేస్తే ఆ అక్రమాలు సిబిఐకి కనపడవా అని ప్రశ్నించారు. నీతి, నిజాయితీ కోసం నిలబడి తమ ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా త్యాగం చేశారన్నారు.