సిబిఐపై జగన్ ఫైర్

సిబిఐపై జగన్ ఫైర్

తనను ఈ నెల 25వ తేదీన విచారణకు రావాలని నోటీసు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ  అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బుధవారం సిబిఐపై తీవ్రంగా ప్రతిస్పందించారు. తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను జైలుకు పంపించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మేలు చేశారని చెప్పి నిమ్మగడ్డ ప్రసాద్‌ను జైలుకు పంపించారని ఆయన అన్నారు. 

సిబిఐకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పులు కనిపించవా అని ఆయన అడిగారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం ఓడరేవుల వ్యవహారాల్లో చంద్రబాబును ఎందుకు విచారించరని ఆయన అడిగారు. ఏం జరిగినా ఉప ఎన్నికలు మాత్రం జరగాలని, ఉప ఎన్నికలు ఆగకూడదని ఆయన అన్నారు. తనకేం జరిగినా సంయమనం పాటించాలని ఆయన ప్రజలను కోరారు. తనపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ఆ పార్టీల కుట్రలు ఫలిస్తాయో లేదో తెలియదని ఆయన అన్నారు. ఆ పార్టీలకు మాత్రం ప్రజలు ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 

వచ్చే నెల 15వ తేదీ వరకు సిబిఐ ముందు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోరుతూ వైయస్ జగన్ దాఖలు చేసిన లంచ్ మోషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 25వ తేదీన సిబిఐ ముందు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో ఈ నెల 25వ తేదీన జగన్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇదే సమయంలో జగన్‌కు అరెస్టు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు చేస్తున్నాయంటూ తమ పార్టీలను విమర్శిస్తున్నారని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు అంటున్నారు. 

వైయస్ జగన్ ఈ నెల 25వ తేదీన సిబిఐ ముందుకు రానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 తేదీ వరకు హైదరాబాదులో 144వ సెక్షన్ విధిస్తూ హైదరాబాదు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన జగన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. 

జగన్ సిబిఐ ముందుకు రావడం వంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నిఘా వర్గాలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.  వైయస్ జగన్  తన ఆస్తుల కేసులో మొదటిసారి సిబిఐ ముందుకు వస్తున్నారు. గతంలో ఓ కేసులో సాక్షిగా ఆయన సిబిఐ ముందుకు వచ్చారు.