జగన్ అనుచరుడు మంగలి కృష్ణ అరెస్టు

జగన్ అనుచరుడు మంగలి కృష్ణ అరెస్టు

మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసిన కేసులో దంతలూరి కృష్ణ అలియాస్  మంగలి కృష్ణను  సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్‌గేట్ వద్ద మంగళవారం సాయంత్రం కృష్ణను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2006 నుంచీ కృష్ణ పలుమార్లు తనకు ఆయుధాలు సరఫరా చేశాడని, వాటితోనే తాను భూ దందాలకు పాల్పడ్డానని సిఐడి అధికారులకు భాను వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. 

కృష్ణ ఇప్పటి వరకు తనకు మొత్తం ఎనిమిది ఆయుధాలు అందజేశాడని కూడా భాను చెప్పాడు. వీటిలో కొన్నిటిని దర్యాప్తు అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే, కృష్ణపై ఆయుధ చట్టం కింద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతని కదలికలపై కన్నేసి ఉంచారు. 44వ నెంబర్ జాతీయ రహదారి గుండా అతను హైదరాబాద్‌కు వెళుతున్నట్లు సిఐడి వర్గాలకు సమాచారం అందింది. హైదరాబాద్ దిశగా వెళుతున్న ఇన్నోవాలో కృష్ణ ఉన్నట్లు సాయంత్రం ఆరు గంటల సమయంలో వారికి సమాచారం అందింది. దీంతో, షాద్‌నగర్ టోల్‌గేట్ వద్ద నిఘా ఉంచి, అక్కడే అతడిని అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌లోని సిఐడి ప్రధాన కార్యాలయానికి తరలించారు. 

పులివెందులకు చెందిన కృష్ణ చిన్నప్పటి నుంచీ జగన్‌కు సన్నిహితుడు. జగన్ ఇంటి పక్కనే ఉండేవాడు. జగన్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థి అయిన పరిటాల రవి హత్యకు సూట్‌కేసు బాంబు ద్వారా కుట్ర పన్నిన కేసులో అనంతపురం కోర్టు ఇప్పటికే అతనికి శిక్ష విధించింది. ఆయుధాల సరఫరాతోపాటు సినీరంగంలోని పలువురిని బెదిరించిన ఘటనల్లో భానుతోపాటు కృష్ణ పాల్గొన్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. 

కాగా, తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సిఐడి అధికారులకు కృష్ణ సంకేతాలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రే అతను లొంగిపోయినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన సిఐడి అధికారులు మంగళవారం మీడియాలో విషయం పొక్కడంతో కాదనలేకపోయారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.