లక్షలాది చెక్కులపై సిబిఐ దృష్టి

లక్షలాది చెక్కులపై సిబిఐ దృష్టి

  వైయస్సార్ కాంగ్రెసు  పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) బ్యాంకుల గోడౌన్లలో పడి ఉన్న లక్షలాది చెక్కులను పరిశీలించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, కోల్‌కత్తా, ముంబై, చెన్నై, తదితర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో పడి ఉన్న చెక్కులను పరిశీలించాలని సిబిఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వైయస్ జగన్ సంస్థల్లోకి బోగస్ కంపెనీల నిధులు మళ్లించిన వ్యవహారం బయట పడుతుందని భావిస్తున్నారు. 

చెక్కుల ద్వారా ఏయే కంపెనీల నుంచి ఏ విధంగా వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు చేరాయనే విషయం తెలుస్తుందని అనుకుంటున్నారు. బ్యాంకు గోదాములను తెరిచి వాటిని పరిశీలించేందుకు సిబిఐ అధికారులు బ్యాంకు అధికారుల సాయం తీసుకుంటున్నారు. ప్రతి కంపెనీకి సంబంధించిన నిధుల ప్రవాహాన్ని క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడానికి బ్యాంకు చెక్కులు పనికి వస్తాయని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. 

పారిశ్రామికవేత్త నిమ్మగడ్డకు చెందిన ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా ఎవెన్యూస్, గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంటు కంపెనీలు జగన్ కంపెనీల్లో 70 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని, చెక్కులను పరిశీలించడం ద్వారా మనీ రూట్ తెలుస్తుందని సిబిఐ అధికారులు అంటున్నారు. ఈ కంపెనీలకు సంబంధించిన మనీ పంపిణీ మార్గాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని, ఇతర కంపెనీల చెక్కలను పరిశీలిస్తున్నామని, చెక్కులను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెడతామని సిబిఐ అధికారులు అంటున్నారు. 

ఇదిలా వుంటే, సిబిఐ అధికారులు ఆదివారం వాన్‌పిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆడిటర్లు సి మారుతి నాగేంద్రం, అన్నం రాజు, పి. జగన్నాథంలను ప్రశ్నించారు. కంపెనీ కార్యదర్శిగా పనిచేసిన నాగేంద్రన్ జగన్నాథన్‌ను కూడా  సిబిఐ  అధికారులు ప్రశ్నించారు. వాడరేవు, నిజాం పట్నం ఓడరేవు, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులు పొందడానికి నిమ్మగడ్డ ప్రసాద్ డబ్బులను ఏ విధంగా మళ్లించారనే విషయంపై నాగేంద్రన్ జగన్నాథం నుంచి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.