హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సమంత

హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సమంత

వరుస హిట్లతో ఇటు తెలుగు, తమిళంలో దూసుకెలుతున్న హీరోయిన్ సమంత తాజాగా హైదరాబాద్‌లో సొంతిల్లు కొనుక్కుంది. తెలుగు సినిమాల షూటింగ్ నిమిత్తం తరచూ హైదరాబాద్ వచ్చిన వెళ్లాల్సి వస్తుండటంతో హోటల్స్‌లో గడపాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ తనకంటూ ఓ ఇల్లు ఉంటే ప్రశాంతంగా గడపొచ్చనే కారణంతో ఇక్కడ ఓ ఇల్లు కొనుక్కుంది. చెన్నయ్‌లోని పోష్ గార్డెన్‌లో సమంతకి ఇప్పటికే ఓ ఖరీదైన ఇల్లు ఉంది.

ప్రస్తుతం సమంత చేతినిండి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె  నాగచైతన్య  హీరోగా రూపొందుతున్న ‘ఆటో నగర్ సూర్య' చిత్రంతో పాటు, గౌతం మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో నటిస్తోంది. ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రం తెలుగు వెర్షన్లో  నాని  హీరోగా కాగా, తమిళ వెర్షన్లో జీవా ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. హిందీ వెర్షన్లో ఆమెతో ఆదిత్యారాయ్ కపూర్ జతకడుతున్నాడు.

అంతే కాకుండా మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు, మణిరత్నం దర్శకత్వంలో ‘కడల్' చిత్రంలో, నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ చెన్నయ్ చిన్నది నటిస్తోంది. మరో వైపు సమంత నటించిన ‘ఈగ' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదే చిత్రం తమిళంలో ‘నాన్ ఈ' పేరుతో విడుదలవుతోంది.

ఇలా ఈ ఏడాది సమంత చేతిలో దాదాపు 9 చిత్రాలు ఉన్నాయి. ఇవేకాకుండా పలు కార్పొరేట్ ఉత్పత్తులకు, పేరు మోసిన షాపింగ్ మాల్స్‌కు  సమంత  బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇలా క్షణం తీరిక లేకుండా బీజీ బిజీగా గడుపుతోంది. ఇంత బిజీగా ఉన్నప్పుడు సంపాదన కూడా అదే రేంజిలో ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే హైదరాబాద్‌లో ఓ ఇంటిని అవలీలగా కొనిపారేసింది.