తెదేపాలోనే ఉంటా... జూనియర్ ఎన్టీఆర్

 తెదేపాలోనే ఉంటా... జూనియర్ ఎన్టీఆర్

తాతయ్య నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే తాను కొనసాగుతానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఒక ఛానల్‌కిచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు తెలుగుదేశం పార్టీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. దీంతో గత కొంతకాలంగా ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మధ్య గ్యాప్ ఉందన్న వాదనలకు కొట్టుకుపోయినట్లయింది. 

తనకు రాజకీయాల గురించి తెలియదనీ, తాత స్థాపించిన తెదేపాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం తన తండ్రితోపాటు తాను కూడా పనిచేస్తానని అన్నారు. 2009లో ఎలా ఎన్నికల ప్రచారానికి వెళ్లానో అలాగే ఎప్పుడూ ముందుకు వెళతానని ప్రకటించారు.

వల్లభనేని వంశీ వ్యవహారం తీసుకొచ్చి తనపై ఆపాదించి తనపై వార్తలు రాశారనీ, వంశీ తనకు చుట్టం, పక్కం కాదనీ తన స్టాండ్ ఎప్పుడూ తాతగారు స్థాపించిన పార్టీకి మద్దతుగా ఉంటానని వెల్లడించారు.