బంగారం భగ్గుమంటోంది

బంగారం భగ్గుమంటోంది

బంగారం భగ్గుమంటోంది. రికార్డు స్థాయిలో పరిగెడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర 30 వేల దరి చేరింది. డాలర్‌ బలపడటంతో నేనుసైతం అంటూ మదుపరులకు కాసులు కురిపిస్తోంది. సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. 

మార్కెట్లో పసిడి కాంతులీనుతోంది. ఒక్కసారి రెక్కలొచ్చి చుక్కలు చూపిస్తోంది. వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధర మూడు వేలు పెరిగి 27 నుంచి రికార్డు స్థాయిలో 30 వేలకు చేరువయ్యింది. సామాన్యునికి అందని స్థాయికి చేరుకొంది. గత యేడాదితో పోలిస్తే ఇప్పటికే బంగారం 23 వేలకు పైనే ఉంటుంది. అదీ ఇప్పుడు 30 వేల మార్కు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. డాలర్‌ విలువ పెరగడంతో బంగారమూ పరుగులు పెడ్తోంది. ఇదే కొనసాగితే మరో ఒకటి రెండు నెలల్లో 32 వేలు చేరువవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

మనదేశంలో బంగారానికి అన్ని విషయాల్లో అధిక ప్రాధాన్యత ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువగానే ఉంటున్నాయ్‌. దానికి తోడు బంగారంపై పెట్టుబడులు పెరగడం కూడా ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారుం ఇరవై తొమ్మిదిన్నర వేలకు పైనే ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం అయితే 29 వేల ధర పలుకుతోంది.

గత బడ్జెట్‌లో బంగారు దిగుమతులపై పన్నులు భారీగా పెంచడం, అటు ఆర్నమెంట్‌ గోల్డ్‌పైనే పన్నుపోటు ఉండటంతో కూడా గోల్డ్‌రన్‌ కారణమౌతున్నాయి. దీంతో శుభాకార్యాలకోసం బంగారం కొనే సామాన్యులు ప్రస్తుత ధర చూసి నిమ్మకుండిపోతున్నారు. పసిడి కాంతులు లేకుండానే పెళ్ళిళ్ళు కానిచ్చేస్తున్నారు. అయితే ధర ఎక్కువగా ఉన్నందున కొనుగోలుదారులు ఆచితూచి కొనాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.