శోభన్ బాబు జయంతి వజ్రోత్సవ వేడుకలు

శోభన్ బాబు జయంతి వజ్రోత్సవ వేడుకలు

ఆంధ్రుల అభిమాన అందాల నటుడు శోభన్ బాబు జయంతి వజ్రోత్సవ వేడుకలను జూన్ 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో కన్నుల పండువగా జరుపనున్నట్లు శోభన్ బాబు అభిమానుల రాష్ట్ర కమిటీ తెలిపింది. బలిపీఠం, గోరింటాకు, దీపారాధన, స్వయంవరం, ధర్మపీఠం దద్దరిల్లింది లాంటి విజయవంతమైన ఉత్తమ చిత్రాలను శోభన్‌కు అందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు సమక్షంలో, సంతోషం సినీ వారపత్రిక అధినేత కొండేటి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శోభన్ బాబు అభిమానులు ఎం.సుధాకర్ బాబు, బి. బాలసుబ్రహ్మణ్యం, జి. జవహర్ బాబు, పి శ్రీనివాసకుమార్, టి. సాయికామరాజు, ఎస్.ఎన్.రావు, పి. అప్పలనాయుడులు ప్రకటనలో తెలిపారు. 

శోభన్ బాబుతో నటించిన సహనటులు, నటీమణుల్ని, ఆయనతో పని చేసిన దర్శక నిర్మాతలను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. శోభన్ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 75 మంది పేద సినీ కళాకారులకు దాసరి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు చిత్రాల పాటలు, నృత్యాలతో కళాకారులు సభికులను అలరిస్తారని తెలిపారు. 

శోభన్ బాబు గురించి...
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.

మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబరున 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 15 జూలై 1960న విడుదలయిన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయమయ్యింది. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కధ (శివుని వేషానికి రూ. 1500 పారితోషికం), ప్రతిజ్ఞా పాలన (నారదుని వేషానికి రూ.750 పారితోషికం) ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు.

శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు. వెంటనే లోగుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలో సోలో హీరోగా నటించాడు.అది కూడా అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లీడరు విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చింది. బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది. 1969లో విడుదలయిన మనుషులు మారాలి సిల్వర్ జూబిలీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి. ఆ చిత్రంతో హీరోగా  శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు.