గాలి బ్రాహ్మణిపై ఇక గీతా రెడ్డి వంతు?

గాలి బ్రాహ్మణిపై ఇక గీతా రెడ్డి వంతు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ప్రస్తుత హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించగా, ఇప్పుడు మంత్రి గీతా రెడ్డి వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే, గీతా రెడ్డిని సిబిఐ కాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జె. గీతా రెడ్డి భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్‌కు ఇచ్చిన రాయితీలపై ఈడి అధికారులు గీతా రెడ్డిని ప్రశ్నించే అవకాశాలున్నట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడి దర్యాప్తు చేస్తోంది. 

గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులోని నిందితులను విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒఎంసి కేసులో చార్జిషీట్లు దాఖలు చేసిన సిబిఐ ఇప్పుడు బ్రాహ్మణి ఇండస్టీస్ లిమిటెడ్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈడి గీతా రెడ్డిని ప్రశ్నించవచ్చునని అంటున్నారు.

బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు గాలి జనార్దన్ రెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డి భారీగా భూములను కేటాయించడమే కాకుండా పలు రాయితీలు ఇచ్చింది. అయితే, బ్రాహ్మణి ఇండస్ట్రీస్ తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణం ఆచరణలోకి రాలేదు.