ఇక ఢిల్లీకి వైయస్ జగన్ తరలింపు

ఇక ఢిల్లీకి వైయస్ జగన్ తరలింపు

జగన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దూకుడు పెంచింది. ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతోంది. జగన్ కంపెనీల్లోకి హవాలా మార్గంలో విదేశీ నిధులు ప్రవహించాయని ఈడీ ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ధారణకు వచ్చింది. ఫెమా (విదేశీ మారకదవ్య్ర నిర్వహణ చట్టం), పీఎంఎల్ఏ (ద్రవ్య అక్రమ చలామణి నిరోధక చట్టం) ఉల్లంఘనకు గురైనట్లు సాక్ష్యాధారాలు కూడా సేకరించింది.

 

ఈ స్థతిలో జగన్‌ను ప్రశ్నించి, ఆయనను అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు పూర్వరంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈడీ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో హైదరాబాద్‌కు పయనమవుతున్నారు. జగన్‌ను కోర్టు అనుమతితో తొలుత చంచల్‌గూడ జైల్లోనే ప్రశ్నించి ఆ తర్వాత ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నారు.

ఎమ్మార్ కేసులో ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్యలను ప్రశ్నించేందుకు ఈడీ ఇప్పటికే కోర్టు అనుమతి కోరింది. అదే విధంగా జగన్‌ను కూడా ప్రశ్నించాలని భావిస్తోంది. మారిషస్ మార్గంలో ప్రవహించిన అక్రమ నిధులకు సంబంధించి జగన్‌పై ఫెమా, పీఎంఎల్ఏ కింద కేసు పెట్టనున్నారు. ఫెమా కింద నేరం రుజువైతే అక్రమంగా ప్రవహించిన డబ్బుకు అనేక రెట్లను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అక్రమ లావాదేవీ మొత్తం రూ.కోటి దాటితే మూడేళ్ల సాధారణ జైలు శిక్ష విధించవచ్చు. అంతకంటే తక్కువ ఉంటే ఆరునెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఫెమా కన్నా పీఎంఎల్ఏ చాలా కఠినమైన చట్టం. దీనికింద కోర్టు అనుమతితో ఆస్తులను జప్తు చేయవచ్చు. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోలేని పక్షంలో హవాలా ద్వారా మళ్లించిన నిధులకు అనేకరెట్ల జరిమానాతోపాటు మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష కూడా తప్పదు. ఇవన్నీ పక్కనపెడితే పీఎంఎల్ఏ కేసులో అరెస్టయితే నెలల తరబడి బెయిల్ లభించడం దుర్లభమని ఈడీ వర్గాలు తెలిపాయి. మధు కోడా కేసులో ఇదే జరిగింది.

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అధికారులు ఎప్పటికప్పుడు సిబిఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఢిల్లీలో వారానికి ఒక్కసారైనా ఈ రెండు దర్యాప్తు సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమై కేసు పురోగతిపై చర్చలు జరుపుతున్నారు. సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. సిబిఐ విచారణ పూర్తయిన తర్వాత జగన్‌ను అదుపులోకి తీసుకోవాలని ఈడి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జగన్ ఒక్కడికే పరిమితం కాదని, ఆయన అక్రమార్జనకు సాయపడిన వారందరినీ అదుపులోకి తీసుకోవాలని ఈడీ భావిస్తోందని తెలుస్తోంది.

సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లను ఇప్పటికే కోర్టు ద్వారా పొందిన ఈడీ అందులోని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. స్వదేశీ కంపెనీల నుంచి మళ్లిన నిధుల వివరాలను కూడా సేకరించింది. తమ వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ చార్జిషీట్లలోని సమాచారంతో సరిపోల్చుకుంది. అక్రమాలకు పక్కా ఆధారాలున్న నేపథ్యంలో తాను కూడా జగన్ ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి కోరే అవకాశం కనిపిస్తోంది.