ప్రణబ్‌కు జగన్ షాకిస్తారా, చంద్రబాబు ఎటు?

ప్రణబ్‌కు జగన్ షాకిస్తారా, చంద్రబాబు ఎటు?

రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి షాక్ ఇస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రస్తుతం 17 మంది శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తీవ్రమైన దెబ్బ కొడుతూ 15 మంది శాసనసభా సీట్లను, భారీ మెజారిటీతో నెల్లూరు లోకసభ స్థానాన్ని జగన్ గెలుచుకున్నారు. జైలులో ఉంటూనే ఆయన పార్టీని విజయపథాన నడిపించారు.

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జులై 19వ తేదీన జరుగుతుంది. వైయస్ జగన్ మద్దతు కోసం పిఎ సంగ్మా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను కలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, అందుకు జైలు అధికారులు అనుమతించలేదు. దీనిపై సంగ్మా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ జగన్‌ను కలుసుకోవడానికి అంతకు ముందు జైలు అధికారులు అనుమతించారు. సంగ్మాను మాత్రం అనుమతించలేదు. ములాఖత్‌లు అయిపోవడం వల్లనే జగన్‌ను కలవడానికి సంగ్మాకు అనుమతి ఇవ్వలేదని జైలు అధికారులు అంటున్నారు.

వైయస్ జగన్ సంగ్మాకు మద్దతిస్తే ప్రణబ్ ముఖర్జీకి కష్టాలు తప్పవని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తన వైఖరిని ప్రకటించలేదు. ప్రణబ్ ముఖర్జీని బలపరిచేందుకు తెలుగుదేశం పార్టీ అంతకు ముందు వార్తలు వచ్చాయి. బిజెపి సంగ్మాకు మద్దతిస్తుండడం వల్ల ప్రణబ్ ముఖర్జీకి చంద్రబాబు మద్దతివ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, కార్పొరేట్ రంగానికి చెందిన ఓ తెలుగుదేశం నాయకుడే అటువంటి వార్తలు రావడానికి కారణమని అంటున్నారు.

ప్రణబ్‌కు మద్దతివ్వాలని కార్పొరేట్ రంగానికి చెందిన పార్టీ నాయకుడొకరు చంద్రబాబుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. అయితే, ఇతర పార్టీ నాయకులు దానికి తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీకి మద్దతిస్తే ఆ విమర్శలను నిజం చేసినట్లవుతుందని అంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాము ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటు చేస్తామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాథోడ్ అన్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు చెప్పారు. ఆయన మంగళవారం ఎన్డియె కన్వీనర్, జెడి (యు) నేత శరద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ప్రణబ్‌కు మద్దతిచ్చే విషయంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటు చేయడమంటే సంగ్మాకు ఓటు చేయడమనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కాంగ్రెసు వ్యతిరేక వైఖరిని చాటుకోవడానికే తాము సంగ్మాకు ఓటు వేశామనే వాదనను తెలుగుదేశం పార్టీ ముందుకు తేవచ్చు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా ఇప్పటి వరకు తన వైఖరిని ప్రకటించలేదు. తెరాస ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పార్టీకి 18 మంది శాసనసభ్యులు, ఇద్దరు లోకసభ సభ్యులు ఉన్నారు. ఈ స్థితిలో రాష్ట్రం నుంచి ప్రణబ్ ముఖర్జీకి ప్రతిపక్షాల మద్దతు లభించకపోవచ్చునని అంటున్నారు.

కాగా, సంగ్మా మంగళవారంనాడు తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు. ఆమె మద్దతును కోరారు. యుపిఎలో రెండో అతి పెద్ద భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెసు పార్టీ సంగ్మాకు మద్దతిస్తే ప్రణబ్‌కు కష్టాలు ఎదురు కావచ్చు. అయితే, మమతా బెనర్జీ సంగ్మాకు ఏ విధమైన హామీ ఇవ్వలేదు. పార్టీలో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటామని మమతా సంగ్మాతో చెప్పారు. అయితే, తాను బోలెడంత ఆశతో కోల్‌కత్తా నుంచి వెళ్తున్నట్లు సంగ్మా చెప్పారు.