రోశయ్యకు ఎసిబి కోర్టు సమన్లు

 రోశయ్యకు ఎసిబి కోర్టు సమన్లు

 తమిళనాడు గవర్నర్,  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. హైదరాబాదులోని అమీర్‌పేట భూముల కేటాయింపు కుంభకోణం కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు రోశయ్యను ఆదేశించింది. ఈ కేసులో ఇంతకు ముందు సమర్పించిన నివేదికను కోర్టు తిరస్కరించింది. రోశయ్యను విచారించకుండా ఎసిబి నివేదికను కోర్టుకు సమర్పించింది. 
హైదరాబాదులోని అమీర్‌పేటలోని భూవ్యవహారం ఆయనను కష్టాల్లోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అమీర్‌పేట భూవ్యవహారంలో ఐఎఎస్ అధికారులు సమర్పించిన పత్రాలను, ఇతర సాక్ష్యాలను జోడిస్తూ తెలంగాణ న్యాయవాదుల సంఘం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇంతకు ముందు ఫిర్యాదు చేసింది. రోశయ్యను రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది.

అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. 2జి కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది టి. శ్రీరంగారావు - దురుద్దేశ్యాలతో విధులు నిర్వహించిన ప్రభుత్వ సేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదని ఎసిబి కోర్టులో రోశయ్యకు వ్యతిరేకంగా వాదించారు.

ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు గతంలో సాక్ష్యాలు ఇచ్చారు. భూమిని డీనోటిఫై చేయవద్దని తాము బలంగా చెప్పామని వారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ఖరీదు చేసే 9.14 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు.