తిరుపతి పై పెదవి విరిచిన వాయలార్

తిరుపతి పై పెదవి విరిచిన వాయలార్

 తిరుపతి స్థానాన్ని తమ పార్టీ చేజార్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వయలార్ రవి నిరాశ వ్యక్తం చేశారు. తిరుపతి స్థానం ఖచ్చితంగా గెలుస్తామనుకున్నామని, కాని పరిస్థితి అందుకు సానుకూలంగా లేదని ఆయన పెదవి విరిచారు. పార్టీలోని అంతర్గత సమస్యలవల్లే ఈ ఉపఎన్నికల్లో వైఫల్యాన్ని చవిచూడవలసి వచ్చిందని ఆయన శుక్రవారం అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రభావితం చేయజాలవని కూడా  వయలార్ రవి అన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక వంటిదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇవి సెమీ ఫైనల్స్ అని, ఫైనల్స్‌లో తమకు, వైయస్సార్ పార్టీకి మాత్రమే పోటీ ఉంటుందని ఈ ఎన్నికలు తేల్చాయని ఆయన వ్యాఖ్యానించారు. మూడు స్థానాలు గెలుస్తామని అంచనా వేసుకున్నప్పటికీ రెండు స్థానాలు మాత్రమే గెలిచామని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కిరణ్, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఫల్యాలవల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని, ఇందుకు వారే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల ఫలితం కాంగ్రెస్‌కు విజయం, ప్రభుత్వానికి అపజయమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానానికి చెడ్డపేరు తీసుకురాకుండా కిరణ్, బొత్స తమంతట తామే సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.

పరకాలలో విజయం సాధించి పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెరాస అభ్యర్థి బిక్షపతికి గట్టి పోటీ ఇచ్చారు.