జగన్ 16 గెలిస్తే రాష్ట్రపతి పాలనే?

జగన్ 16 గెలిస్తే రాష్ట్రపతి పాలనే?

ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు 16 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ పార్టీ అన్ని స్థానాలు గెలిస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల ప్రభుత్వం అస్థిరపడుతుందని, ఆ స్థితిలో కేంద్ర పాలన విధించడమే మంచిదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తుందని అంటున్నారు. మొత్తం మీద, జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనేది అందరూ నమ్ముతున్న విషయం. కాంగ్రెసుకు 3 నుంచి 6 స్థానాలు వస్తే, పరువు నిలబడుతుందని, అధిష్టానానికి సర్దిచెప్పుకోవడానికి వీలవుతుందని అంటున్నారు.

కాంగ్రెసుకు 3 నుంచి ఆరు స్థానాలు వచ్చి, తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఒక సీటు వస్తేనే వైయస్ జగన్‌కు అనుకూలంగా రాజకీయాలు ఆగిపోతాయని అంటున్నారు. అందుకు భిన్నమైన ఫలితాలు వెలువడితే మాత్రం తీవ్రమైన రాజకీయ సంక్షోభం తలెత్తుతుందనే అంచనాలు వేస్తున్నారు. జగన్ పార్టీకి 16 స్థానాలు వస్తే వెనువెంటనే 15 నుంచి 18 వరకు శాసనసభ్యులు అటు వైపు దూకే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

గతంలో వైయస్ జగన్‌ నిర్వహించిన లక్ష్యదీక్ష, ఫీజుపోరు, జనదీక్ష, రైతుపోరు వంటి కార్యక్రమాలకు దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ ఆ తర్వాత జరిగిన అవిశ్వాస తీర్మాన సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బయటకొచ్చారు. మళ్లీ ఉప ఎన్నికల సమయంలో, జగన్‌ జైలుకు వెళ్లిన సమయంలో ఆళ్లనాని, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సుజయకృష్ణ రంగారావు జగన్‌కు మద్దతు ప్రకటించారు.ఇదంతా జగన్‌ వ్యూహబృందం వ్యూహాత్మకంగా వేసిన అడుగేనని అంటున్నారు. మిగిలిన వారంతా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా సాధించకపోతే జగన్ వైపు రావడం ఖాయమనే మాట వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే రాష్ట్రంలో కేంద్రపాలన విధించడం అనివార్యమవుతుందని కాంగ్రెసు సీనియర్లు చెబుతున్నారు.

రాష్టప్రతి పాలన వచ్చే అవకాశాలు పెద్దగా లేవని కాంగ్రెస్‌లోని ఓ వర్గం వాదిస్తోంది. జగన్‌ వైపు ఇంకా 18 మంది ఎమ్మెల్యేల వరకూ వెళ్లినా ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదని, తెలుగుదేశం పార్టీ సహకారం ఉంటే తప్ప ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదని, తెలుగుదేశం పార్టీ అందుకు సిద్ధపడకపోవచ్చునని అంటున్నారు. 2014 నాటికి జగన్‌ను కట్టడి చేసి, ఆయన బలాన్ని తగ్గించడం ఎలా అనే విషయాలపైనే కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతుందని అంటున్నారు.