‘జగన్ నిర్దోషి' మూవీ... కాన్సెప్ట్ ఏమిటి?

‘జగన్ నిర్దోషి' మూవీ... కాన్సెప్ట్ ఏమిటి?

పాపులర్ సాంగ్స్‌ను ఈ మధ్య సినిమా పేర్లుగా పెడుతుండటం టాలీవుడ్లో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ మూవీ ‘రా.వన్' చిత్రంలో పాపులర్ అయిన ‘చమ్మక్ చల్లో' పాటను తెలుగు నిర్మాత డిఎస్. రావు తన మూవీకి టైటిల్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నిర్మాత శాఖమూరి మల్లిఖార్జునరావు కొత్త ట్రెండుకు తెర లేపారు. తాజాగా ఆయన ‘జగన్ నిర్దోషి' అనే చిత్రాన్ని నిర్మించ బోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన వైఎస్ జగన్ ఇష్యూను టార్గెట్ చేయడం ద్వారా తన సినిమాపై అందరి దృష్టి పడేలా చేయడమే ఈ టైటిల్ వెనక ఉన్న అసలు రహస్యం.

శాఖమూరి మల్లిఖార్జునరావు సూపర్ స్టార్ కృష్ణ బంధువు. ఈ చిత్రంలో ఆయన తనయుడు శివ హీరోగా నటిస్తున్నాడు. వెంకన్న బాబు దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. హీరోయిన్ సంజన హీరోయిన్‌గా ఎంపికయింది.  జగన్ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి ఈచిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఆవిషయాలపై ఇందులో ఎలాంటి చర్చ ఉండదని, అయితే.... జగన్ ఫాలోయింగ్‌ను తమ సినిమా వైపు నడిపించడమే లక్ష్యంగా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ఓ సంచలనం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ పోకడతో ఏపి రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం జనాల్లో ఆయనకున్న ఫాలోయింగ్, జనాదరణ ఏమిటో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే నిదర్శనం. జగన్‌కు సంబంధించి ఏ అంశం అయినా జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జగన్ నిర్దోషి' అనే టైటిల్ ద్వారా జగన్ సెంటిమెంటను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ నిర్మాత ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూద్దాం...