'మా టార్గెట్ నందమూరి అభిమానులు కాదు'

'మా టార్గెట్ నందమూరి అభిమానులు కాదు'

 రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరి కోసం తీశాం. హృదయాన్ని స్పృశించే అంశాలకు వినోదాన్ని మేళవించి సిద్ధం చేసుకున్న కథ ఇది అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. ఆయన తాజా చిత్రం అధినాయకుడు ప్రమోషన్ లో భాగంగా మీడియాలో మాట్లాడుతూ ఇలా స్పందించారు. నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రంలో పెద్దాయన (హరిశ్చంద్ర ప్రసాద్) పాత్ర అందరినీ ఆకట్టుకుంటోందని ఆయన చెప్పారు.

పెద్దాయన పాత్ర విషయమై మాట్లాడుతూ..హరిశ్చంద్రప్రసాద్ పాత్ర చిత్రీకరణ కోసం నేను శాయశక్తులా కృషి చేశాను. ఆ పాత్రను తీర్చిదిద్దడంలో పలువురి సలహాలు తీసుకున్నాను. ఇంకొంచెం నిడివి ఉంటే బావుండేదని ఇప్పుడు అందరూ అంటున్నారు. కానీ ఆ పాత్ర స్వీట్‌లాంటిది. స్వీట్‌ని కొంచెం తింటే బావుంటుంది. అలాకాదని భోజనం మానేసి స్వీట్లు తింటూ కూర్చుంటే వెగటు పుడుతుంది. అందుకే అందరూ బావుందనుకుంటుండగానే ఆపేశాం అన్నారు.

ఇంటిల్లిపాదీ మెచ్చుకునేలా బాలకృష్ణను చూపించాలని 'అధినాయకుడు' తీశాం. ఇందులో పెద్దాయన (హరిశ్చంద్ర ప్రసాద్) పాత్ర ఇంట్లో పెద్దవారందరికీ నచ్చుతుంది. యువకుడి పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా ఉంటుంది. రామకృష్ణప్రసాద్ పాత్ర మిగిలినవారందినీ మెప్పిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల వారినీ సంతృప్తిపరిచేలా ఈ సినిమా వచ్చింది అని పరుచూరి మురళి అన్నారు.


అధినాయకుడు'లో మూడు పాత్రల పోషణ విషయంలో బాలకృష్ణగారు చాలా శ్రద్ధ కనబరిచారు. అందుకే ఆ మూడు పాత్రలను ఒక్క వ్యక్తి కాకుండా ముగ్గురు చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ పాత్రల్లో అంతలా ఆయన మమేకమైపోయారు. ఫక్తు బాలకృష్ణ సినిమాకు సంగీతం ఎలా ఉంటే బావుంటుందో కల్యాణిమాలిక్ అర్థం చేసుకుని అలాంటి బాణీలను సమకూర్చారు. ఏది ఏమైనా మా చిత్రం క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది అన్నారు.