ఫ్రెండ్‌తో ఎమ్మెల్యే రెండో పెళ్లి

 ఫ్రెండ్‌తో ఎమ్మెల్యే రెండో పెళ్లి

 అస్సాం రాష్ట్రంలో ఓ మహిళా శాసనసభ్యురాలు తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకొన్న సంఘటన వివాదాస్పదంగా మారింది. ముప్పై మూడేళ్ల బర్ఖోలి ఎమ్మెల్యే రుమీ నాథ్ కొద్ది రోజుల క్రితం అదృశ్యమైంది. శనివారం ఆమె హఠాత్తుగా తన రెండో భర్తతో కనిపించింది. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఆమె తన ముస్లిం మతంలోకి మారి తన పేరును రబియా సుల్తానాగా మార్చుకుంది.

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ మహిళా ఎమ్మెల్యే చట్టాన్నే ఉల్లంఘించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భర్తకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. అసోం బరాక్ వ్యాలీలోని బోర్ఖోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ రుమి నాథ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ పెళ్లి వ్యవహారంపై బరాక్ వ్యాలీ లాయర్ల అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని ఉల్లంఘించి రెండో పెళ్లి చేసుకున్న మహిళా ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. అయితే ఇంత వివాదం రాజుకుంటున్నా మహిళా ఎమ్మెల్యే మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని.. తాను భయాపడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తెలిపారు.

జకీర్ తన భర్త అని, తనకు రాకేష్ సింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని, త్వరలో విడాకులకు దరఖాస్తు చేస్తానని రుమీ నాథ్ చెప్పారు. తాను ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లతో రెండో పెళ్లి చేసుకోలేదని చెప్పారు. తాను తన రెండో పెళ్లికి ముందే ఇస్లాం మతాన్ని స్వీకరించానని చెప్పారు. ఆమె జాకీ జకీర్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు.

ఇతను గత కొంతకాలంగా ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండో పెళ్లి ఫోటో గ్రాఫ్స్ టివి ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. కాగా రుమీ నాథ్ మొదటి భర్త రాకేష్ సింగ్ తన భార్య అపహరణకు గురైనట్లుగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా.. 2009లో హర్యానా ఉప ముఖ్యమంత్రి చందర్ మోహన్ తన కార్యాలయంలో అసభ్యంగా ప్రవర్తించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తన పేరును చంద్ మహ్మద్‌గా మార్చుకొని.. అనురాధ బాలి అలియాస్ ఫిజా అనే మాజీ న్యాయవాదిని వివాహం చేసుకున్నారు.