జగన్‌కు బలాన్నిచ్చిన అన్నా హజారే టీమ్

జగన్‌కు బలాన్నిచ్చిన అన్నా హజారే టీమ్

అన్నా హజారే టీమ్ చేసిన వాదన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కొండంత బలాన్నిచ్చేట్లే ఉంది. సిబిఐ ద్వారా కాంగ్రెసు అధిష్టానం తనను వేధిస్తోందనే జగన్ వాదనకు అనుకూలంగానే  అన్నా హజారే  టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్ వాదన ఉంది. సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు సిబిఐ ఉపయోగపడుతుందని ఆయన శుక్రవారం ధ్వజమెత్తారు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఉదంతమే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. 

సిబిఐ విచారణపై తమకు ఏ మాత్రం విశ్వాసం లేదని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్న అన్నా టీమ్ ఈ కొత్త వాదనను ముందుకు తెచ్చింది. యుపిఎకు మద్దతుగా నిలిచినందుకే సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, బిఎస్పీ నేత మాయావతి, ఆర్జెజీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ వంటివారిని అరెస్టు చేయలేదని, యుపిఎకు ప్రత్యర్థిగా మారినందు వల్లనే జగన్‌ను అరెస్టు చేశారని ఆయన వాదించారు. 

గనుల కేటాయింపుపై సిబిఐ విచారణ అనేది ఓ నాటకమని, సిబిఐ దర్యాప్తు అంటే ప్రధానికి క్లీన్ చిట్ ఇవ్వడమేనని ఆయన శుక్రవారం ఘజియాబాద్‌లో అన్నారు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఎజెండాకు అనుగుణంగా నడుచుకుంటుందని చెప్పడానికి వైయస్ జగన్ ఉదంతమే నిదర్శనమని ఆయన అన్నారు. అలాంటి సిబిఐ బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలపై స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఎలా అనుకుంటామని ఆయన అడిగారు. 

పార్లమెంటులో తమకు మద్దతు ఇచ్చేవారిని వదిలేసి, మద్దతివ్వనివారిని కాంగ్రెసు సిబిఐ ద్వారా వేధిస్తోందని ఆయన విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదని భావిస్తే దర్యాప్తునకు ప్రధాని ఎందుకు జంకుతున్నారని ఆయన అడిగారు.