జూన్ లో ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా'

జూన్ లో ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా'

బాలకృష్ణ అతిథి పాత్రలో... మనోజ్, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఊకొడతారా..ఉలిక్కి పడతారా'. చిత్ర పరిశ్రమలో నందమూరి, మంచు కుటుంబాల మధ్య ఉన్న దశాబ్దాల ఆత్మీయానుబంధాన్ని గురించి తెలుగువారికి కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. ఆ అనుబంధాన్ని పురస్కరించుకోవడంతో పాటు దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై ‘ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి అంగీకరించారు నందమూరి బాలకృష్ణ.

ఆయన చేరికతో ఇదొక ప్రతిష్టాత్మక భారీ చిత్రంగా, ప్రేక్షకులను, ట్రేడ్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు విడుదల చేసిన ప్రెస్‌నోట్లో వెల్లడించారు. గత వారం ఈ చిత్రం ఆడియో విడుదలైన విషయం తెలిసిందే. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో లేడీ ప్రొడ్యూసర్ మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ‘ఊకొడతారా..ఉలక్కి పడతారా' చిత్రం జూన్ ఆఖరి వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత లక్షీప్రసన్న మాట్లాడుతూ..‘ఒక విజయవంతమైన సినిమాకి కావాల్సిన సమస్త అర్హతలు, ఆకర్షణలతో రిలీజ్‌కు రెడీ అయింది మా సినిమా. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయమైన మా అన్నయ్య బాలకృష్ణ గారు ఇందులో చేసిన పాత్రకు చాలా హై ఓల్టేజ్ రెస్పాన్స్ వస్తుందనడంలో సందేహం లేదు. మా నాన్నగారు చేసిన ‘పెద్దరాయుడు' కేరక్టర్ ఎంత మెమొరబుల్ కేరక్టరో ఇందులో బాలకృష్ణ చేస్తున్న పాత్ర కూడా అంతే మొమోరబుల్ కేరక్టర్ గా నిలిచి పోతుంది. జూన్ ఆఖరి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానిక ప్లాన్ చేస్తున్నాం. ఇందులో నేను ఓ ప్రత్యేక పాత్రను పోషించాను'అన్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలకృష్ణకు ఈ సందర్భంగా లక్ష్మి శుభాకాంక్షలు తెలిపింది. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.