జగన్‌ను కలిసిన బావ అనిల్

జగన్‌ను కలిసిన బావ అనిల్

 అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు పలువురు నేతలు శుక్రవారం కలిశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లు ములాఖత్‌లో భాగంగా ఆయనను కలిశారు.

దాదాపు ఇరవై నిమిషాలు జగన్‌తో వారు భేటీ అయ్యారు. కుటుంబ సభ్యుల అనంతరం మాజీ మంత్రి, వరంగల్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ, శాసనమండలి సభ్యుడు, సురేఖ భర్త కొండా మురళీధర రావు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు కలిశారు.

కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో అరెస్టయిన పట్టాభిరామా రావును రెండు రోజుల ఎసిబి కస్టడీకి కోర్టు అనుమతించింది. గాలి బెయిల్ వ్యవహారంలో పట్టాభిరామా రావునే అంతిమ లబ్ధిదారని ఎసిబి కోర్టుకు తెలిపింది. పట్టాబితో సంప్రదింపులు జరిపిందెవరో తేలాలంటే కస్టడీకి అప్పగించాలని కోరింది.

ఇప్పటికే ఈ కేసులో పట్టాభి కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జి చలపతి రావులను కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. కాగా పట్టాభిరామా రావును విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలుకు తరలించారని కోర్టు ఎసిబిని ఆదేశించింది.