పెట్టుబడులపై జగన్‌కు ప్రశ్నలు

పెట్టుబడులపై జగన్‌కు ప్రశ్నలు

  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ  అధ్యక్షుడు  వైయస్ జగన్  ఐదు రోజుల సిబిఐ కస్టడీ గురువారం సాయంత్రం ముగిసింది. ఐదో రోజు గురువారం ప్రశ్నించిన తర్వాత సిబిఐ ఆయనను చంచల్‌గుడా జైలుకు తరలించింది. ఆయనను రేపు (శుక్రవారం) కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గురువారంనాడు వైయస్‌ జగన్‌ను సండూర్ పవర్, జననీ ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై సిబిఐ జెడి ప్రశ్నించినట్లు సమాచారం.

 

బుధవారం వరకు జగన్‌ను జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డితో కలిపి సిబిఐ విచారించింది. గురువారంనాడు మాత్రం జగన్‌ ఒక్కరినే సిబిఐ జెడి లక్ష్మినారాయణ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జగన్‌తో పాటు బుధవారం వరకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని, విజయసాయి రెడ్డిని, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణా రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఐదు రోజుల పాటు జగన్‌ను దాదాపు 30 గంటల పాటు విచారించారు.

ఇదిలావుంటే, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం కొట్టేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. గత నెల 24వ తేదీన సిబిఐ మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసింది. బెయిల్ ఇస్తే మోపిదేవి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. అనారోగ్య పరిస్థితి ఏదైనా తలెత్తితే జైలు అధికారులు చూసుకుంటారనే సిబిఐ వాదనతో కూడా కోర్టు ఏకీభవించింది. మోపిదేవికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

వాన్‌పిక్ వ్యవహారంలో మోపిదేవి వెంకటరమణ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది. కాగా, రైతులకు భూముల సేకరణకు గాను నిమ్మగడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 15 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని సిబిఐ తెలిపింది. మిగతా మొత్తం ఎటు వెళ్లిందో నిమ్మగడ్డ ప్రసాద్‌కు, మోపిదేవికి తెలుసునని సిబిఐ వ్యాఖ్యానించింది.