జగన్‌ను వేధించారు: విజయమ్మ

జగన్‌ను వేధించారు: విజయమ్మ

రాష్ట్ర ప్రజలు అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను నమ్మడం లేదని తేలిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు,  పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. ఆమె లోటస్‌పాండులోని తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచాయని, అయినప్పడికీ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు.

ఎంతలా ప్రలోభ పెట్టినా ప్రజలు వారి ప్రలోభాలకు లొంగలేదన్నారు. ప్రజలు తమకు మంచి విజయం అందించారని, ఇక అసెంబ్లీలో మంచి ప్రతిపక్షంగా ఉండి స్పందిస్తామని అన్నారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి జగన్‌ను వేధించాయన్నారు. ప్రజాకోర్టులో న్యాయమైన తీర్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై విజయమ్మ హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ దువ్వుతున్నారు! జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెసు ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీలను మమత అంగీకరించడం లేదు. అంతేకాకుండా ఆమె అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, సోమనాథ్ ఛటర్జీలను ప్రతిపాదించి వారిలో ఎవరనో ఒకరిని రాష్ట్రపతి రేసులో ఉంచాలని కాంగ్రెసుకు సూచించింది. అందుకు కాంగ్రెసు ససేమీరా అంది.

దీంతో కాంగ్రెసుకు షాకిచ్చేందుకు మమత సిద్ధమైంది. ఇందుకోసం ఆమె తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా ఉప ఎన్నికలలో 16 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానం గెలుచుకున్న జగన్‌ను దువ్వుతున్నారు! ఫలితాలు విడుదలయ్యాక మమతా బెనర్జీ విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. తృణమూల్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ స్వయంగా వైయస్ విజయమ్మకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.