జగన్‌పై ఈసికి లగడపాటి ఫిర్యాదు

జగన్‌పై ఈసికి లగడపాటి  ఫిర్యాదు

 అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్  ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని  లగడపాటి రాజగోపాల్  ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను అన్యాయంగా జైలులో పెట్టారంటూ కరపత్రాలు, హోర్డింగుల ద్వారా జగన్ ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. దాన్ని కోర్టు ధిక్కారంగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావించాలని ఆయన కోరారు.

 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఉచితంగా ఫ్యాన్లు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెసు నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పథకాలను సాక్షి మీడియాలో వైయస్సార్ కాంగ్రెసు పథకాలుగా ప్రసారం చేసుకోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎలాంటి గుర్తింపు, మేనిఫోస్టో లేని  వైయస్సార్ కాంగ్రెసు పార్టీసాగిస్తున్న అరాచకాలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కోరారు.

ఇదిలావుంటే, ఎన్నికల నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని, ఓటు వేసేందుకు గత ఎన్నికల్లో మాదిరిగా 16 గుర్తింపు కార్డులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి అరెస్టయితే అబిమానంతో ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. దోచిన సొమ్మును వైయస్సార్ కాంగ్రెసు, అధికార పక్షం ఉప ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

ఉప ఎన్నికల సందర్భంగా 35.47 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్‌లాల్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పది కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు స్లిప్‌లు అందనివారు బూత్ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అక్రమాలు జరిగినట్లు తెలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఫిర్యాదు చేసేవారి పేర్లు రహస్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.

ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత నమూనా బ్యాలెట్ పత్రాల పంపిణీని నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఎస్ఎంల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన చెప్పారు. గంపగుత్త ఎస్ఎంఎస్‌ల గురించి సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు కోరుతామని ఆయన చెప్పారు.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు: 8897000401, 402, 403, 404, 405