కాంగ్రెసు నేతలపై చిరంజీవి నిప్పులు

కాంగ్రెసు నేతలపై చిరంజీవి నిప్పులు

 కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు నాయకులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. రామచంద్రాపురం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి శాసనసభకు గెలిచిన తోట త్రిమూర్తులు కార్యర్తలతో పాటు వచ్చి చిరంజీవిని కలిశారు. ప్రజారాజ్యం పార్టీని, కాంగ్రెసును వేరు చేసి చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారు.

మన ఓట్లు లేనిదే రెండు చోట్ల కాంగ్రెసు ఎలా గెలిచిందని ఆయన అడిగారు. ప్రజారాజ్యం కార్యకర్తలు,  చిరంజీవి అభిమానులు మాత్రమే కాంగ్రెసుకు ఓటేశారని ఆయన అన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏమిటో చూపిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుల్లో మార్పు వస్తుందని ఇంత కాలం ఎదురు చూశానని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని కాంగ్రెసు పెద్దలు డిసైడ్ అయిపోయారని, అందుకే కష్టపడి పనిచేయడం లేదని ఆయన విమర్శించారు.

రెండు, మూడు రోజుల్లో తాను ఢిల్లీ వెళ్తానని, పార్టీ పరిస్థితిపై నివేదిక ఇస్తానని ఆయన చెప్పారు. ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల పట్ల సానుభూతి మాత్రమే కాంగ్రెసు ఓటమికి కారణం కాదని, కాంగ్రెసు వైఫల్యాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల పట్ల చూపుతున్న వివక్షను తాను సహించలేకపోతున్నానని, వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని చిరంజీవి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారికి తగిన ప్రాధాన్యం భవిష్యత్తులో ఇస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కార్యర్తలు ఉత్సాహంగా పనిచేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెసుదే విజయమని ఆయన అన్నారు. పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లనే రామచంద్రాపురం, నర్సాపురం మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెసు ఓడిపోయిందని ఆయన అన్నారు. స్థానిక నాయకులు తనకు సహకరించలేదని తిరుపతి అభ్యర్థి తనకు చెప్పుకుని బాధపడ్డారని ఆయన చెప్పారు. సమన్వయం విషయంలో పార్టీ ముఖ్య నేతల తీరు అసంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను గుర్తించకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణమని ఆయన అన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెసు కార్యకర్తల మధ్య సమన్వయం ఇప్పటి వరకు కుదరలేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందని అనుకుంటే నైరాశ్యం చోటు చేసుకుంటుందని, అది దరి చేరకుండా ఉత్సాహంతో పనిచేస్తే కాంగ్రెసు విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. పార్టీలో ఐకమత్యం లేకపోవడం పెద్ద లోపమని ఆయన అన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెసుకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.