వైయస్ ఆరాధన వల్లే:జెసి

వైయస్ ఆరాధన వల్లే:జెసి

 వైయస్ రాజశేఖర రెడ్డి ఆరాధన వల్లనే తమ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు,  మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనగా, తమ కాంగ్రెసు పార్టీ బలహీనతలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా మారాయని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వారు విడివిడిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  వైయస్ రాజశేఖర రెడ్డిని అతిగా ఆరాధించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమికి లక్ష కారణాలున్నాయని ఆయన అన్నారు. వ్యక్తి పూజ కూడా కాంగ్రెసు ఓటమికి ఓ కారణమని ఆయన అన్నారు. పార్టీలోని లోటుపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ కలుపుకుని పోతారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ఒరిగిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రెడ్డి సామాజిక వర్గమంతా వైయస్ జగన్ వైపు వెళ్లారని క్రెడిట్ ఇస్తున్నారని, నిజానికి అందులో నిజం లేదని జెసి అన్నారు. క్రిస్టియానిటీని అనుసరించే జగన్ నిజానికి రెడ్డి కారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసలు రెడ్డి అని, రాయలసీమ రెడ్డి అని ఆయన అన్నారు.

తమ బలహీనతలే వైయస్ జగన్ బలంగా మారాయని దామోదర రాజనర్సింహ అన్నారు. సానుభూతి వల్లనే వైయస్ జగన్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచిందని చెప్పలేమని ఆయన అన్నారు. సానుభూతి కొంత మేరకే పనిచేస్తుందని, సానుభూతి పని చేసి ఉంటే కాంగ్రెసు పార్టీ రెండు సీట్లు గెలిచి ఉండేది కాదని ఆయన అన్నారు. జగన్ సునామీలో అంతా కొట్టుకుపోయామని నెల్లూరు లోకసభ స్థానంలో ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు నుంచి శనివారం విశాఖపట్నం వచ్చారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం పాలపొంగులాంటిదని, ఉప ఎన్నికల్లో విజయాన్ని చూసి బలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, కరెంట్ కోత వంటి అంశాల వల్లనే కాంగ్రెసు ఓటమి పాలైందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలవడం, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించడం పరిపాటి అని ఆయన అన్నారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని అడిగే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా గెలిచి కాంగ్రెసు హ్యాట్రిక్ సాధిస్తుందని ఆయన అన్నారు.