ఓటమికి కంట తడి పెట్టిన వెంకటరమణ

 తిరుపతి శానససభా స్థానంలో ఓటమికి కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వెంకటరమణ కంట తడి పెట్టారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా కలత చెందిన వెంకటరమణ మీడియా సమావేశంలో నిభాయించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఆయన కన్నీటిని నిలువరించుకోలేకపోయారు.

ఓటమిని తాను ఊహించలేదని వెంకటరమణ అన్నారు. అడిగినవారందరికీ తాను సహాయం చేశానని, అయినా ఓడిపోయానని ఆయన అన్నారు. వెన్నుపోటుదారుల వల్లనే తాను ఓడిపోయానని, పార్టీ నాయకుల నుంచి తనకు పూర్తి సహాయ సహకారాలు అందలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై 17,823 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

తిరుపతి సీటును మంత్రి గల్లా అరుణ కుమారి తన కుమారుడు గల్లా జయదేవ్‌కు ఆశించారు. తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఆమె అందులో ఫలితం సాధించలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవతోనే వెంకటరమణకు కాంగ్రెసు అధిష్టానం తిరుపతి టికెట్ ఇచ్చిందని అంటారు.

రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి రాజీనామా చేయడంతో తిరుపతి శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేశారు. వెంకటరమణ, చదవలవాడ కృష్ణమూర్తి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా భూమన కరుణాకర్ రెడ్డి విజయానికి ఒక కారణమని అంటున్నారు.