అధిష్టానానికి యడ్డీ వర్గం డెడ్‌లైన్

అధిష్టానానికి యడ్డీ వర్గం డెడ్‌లైన్

 కర్నాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి సదానంద గౌడ మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు తమ పార్టీ బిజెపి అధిష్టానం మెడపై కత్తి పెట్టారు! మంత్రివర్గంలోని యడ్యూరప్ప వర్గానికి చెందిన ఎనిమిది మంత్రులు బిజెఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఈ విషయాన్ని తేల్చాలని లేదంటే రాజీనామా చేస్తామని వారు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

అయితే రాజీనామా హెచ్చరికలను  ముఖ్యమంత్రి సదానంద గౌడ తేలిగ్గా కొట్టి పారేశారు. తాను ఎన్నో కష్టాలకు ఒర్చి, కిందిస్థాయి నుండి ఎదిగానని, ఇలాంటివి ఎన్నో చూశానని, ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సదానంద చెప్పారు. ఆయన మైసూరులోని దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను మంత్రుల రాజీనామాపై ప్రశ్నించారు. తాను పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

యడ్యూరప్ప రాజీనామా అనంతరం బిజెపిలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఇచ్చిన మాట ప్రకారం తనను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన యడ్యూరప్ప తాజాగా తనను కాకుండా తాను సూచించిన వారిని సిఎం పీఠంపై కూర్చుండ బెట్టాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సురేష్ శెట్కార్‌ను లేదా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఈశ్వరప్పను సిఎంగా చేయాలని యడ్డీ సూచిస్తున్నారు.

ఇందుకు ఆయన వర్గం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు డెడ్ లైన్ పెట్టింది. సదానంద గౌడను మాత్రం మార్చాల్సిందేనని యడ్డీ వర్గం డిమాండ్ చేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు కోసం డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని, తనకు మాత్రం ఆ విషయం తెలియదని, తనను సిఎం బాధ్యతలు చేపట్టమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారని.. అయితే తమ పార్టీ అధిష్టానం సూచనల మేరకే తాను నడుచుకుంటానని ఈశ్వరప్ప చెప్పారు.