దేశాన్ని కలవరపెడుతున్న ఆర్థి మాంద్యం

దేశాన్ని కలవరపెడుతున్న ఆర్థి మాంద్యం

ఆర్థిక మాంద్యం భవిష్యత్తులో దేశానికి గడ్డు స్థితిని తెచ్చే పెట్టే పరిస్థితి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి కేవలం 5.3శాతంగా నమోదు కావడంతో సంవత్సర వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితమైంది. ముందస్తు అంచనా 6.9శాతాన్ని అందుకోలేకపోయింది. మూడవ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. నాలుగవ త్రైమాసికంలో వెలువడిన గణాంకాలు మరింత ఆందోళనకు గురి చేశాయి. మైనింగ్‌, ఉత్పత్తి రంగాలో వృద్ధి కుంచించుకుపోవడమే అందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. మైనింగ్‌ 0.9శాతంకాగా, ఉత్పత్తి రంగం 2.5శాతం కుంచించుకుపోయింది. 

రానున్న త్రైమాసికాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలున్నాయి. పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశ లేదు. ఆర్థికరంగానికి విత్తపరమైన సాయం చేసేందుకు భారతప్రభుత్వం ముందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వృద్ధికి తోడ్పడేందుకు బాధ్యతను భుజానికెత్తుకోవలసిన అవసరం రిజర్వ్‌ బ్యాంక్‌ పై ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికీ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో వడ్డీ రేట్లకు కోత పెట్టడం రిజర్వ్‌ బ్యాంకుకు అంత సులభమైన విషయం కాదు 

వడ్డీ రేట్ల తగ్గింపు ద్రవ్యోల్బణ అంచనాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండడమే అందుకు కారణం. అందువల్ల సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లలో కోత పెట్టడానికి ఆర్‌బిఐ ప్రయత్నించకపోవడమే మంచిది. ఈ దశలో వడ్డీ రేట్ల కోత సాయపడకపోవచ్చు కూడా. ఇటీవలే చేసిన రెపో రేటు తగ్గింపు పెట్టుబడి వాతావరణాన్ని, దేశ వృద్ధి దృక్పధాన్ని మార్చడంలో విఫలం కావడం వల్ల అది ఉపయోగపడదని చెప్పవచ్చు. వడ్డీ రేట్లపై అస్థిరత కారణంగా కంపెనీలు, పెట్టుబడిదారులు రేట్ల కోత కన్నా ద్రవ్యోల్బణం దిగిరావాలని కోరుకుంటారు. ఐరోపాలో పరిస్థితి ఇంకా నిలకడగా ఉన్నప్పుడే మనం ఈ పరిస్థితిని ఎదుర్కోవడం పరిస్థితి జటిలమయ్యే సంకేతాలిస్తోంది. ఒకవేళ ఐరోపా వృద్ధి నిలిచిపోతే మన దేశం ఇంకా సంక్షోభంలో పడుతుంది. 

ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో ఆర్థిక వృద్ధి తగ్గినప్పుడు ఆర్థికంగాను, వ్యక్తిగత స్థాయిలోనూ తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వాస్తవ వృద్ధి కన్నా ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటే ఆ దేశంలో వాస్తవాదాయం తగ్గుతోందన్న మాట. దీని ప్రభావం వినియోగం, పొదుపు, పెట్టుబడి పద్ధతులపై ఉంటుంది. స్థూల స్థాయిలో చెప్పుకోవాలంటే ప్రైవేటు వినియోగం తగ్గుతోందనే విషయాన్ని ఈ అంకెలు ప్రతిబింబిస్తున్నాయి. దీనితో పాటుగా పొదుపు, పెట్టుబడులు కూడా తగ్గుతున్నాయి. పెట్టుబడులు, మదుపు తగ్గడమంటే కొంత కాలం వృద్ధికి సమస్య ఏర్పడినట్టే అర్థం. తక్కువ వృద్ది అంటే తక్కువ ఆర్థిక వృద్ధి.

వ్యక్తిగత స్థాయిలో వాస్తవాదాయం తగ్గడమంటే పొదుపు, వినియోగానికి సంబంధించిన ఎంపిక సంక్లిష్టం కావడమని అర్థం. తక్కువ పొదుపు, అస్థిరమైన మార్కెట్‌ పరిస్థితులు గృహస్థుల భవిష్యత్తు ప్రణాళికలను సంక్లిష్టం చేస్తాయి. స్టాక్‌ మార్కెట్లో పరిస్థితులు కూడా ఇప్పుడప్పుడే మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు. పడిపోతున్న వృద్ధి, కరెన్సీ, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం, కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో మార్కెట్లు మనుగడ సాగించలేవు. అంతేకాదు, యూరోప్‌లో సంక్షోభ అవకాశాల ముప్పు కిందే మార్కెట్లు ఉంటాయి. 

యూరో ప్రాంతంలో పరిస్థితులు మరింత తీవ్రం కానప్పటికీ ఇక్కడ మాత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అంగీకరించి అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉది. అది వేగంగా క్రియాశీలకమై సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపరచేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలు మార్కెట్లకు పంపగలగాలి.