బాలకృష్ణ ఇంట్లో దొంగతనం

బాలకృష్ణ ఇంట్లో దొంగతనం

బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడిన విషయమే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడి విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

 

బాలకృష్ణ ...జూబ్లీహిల్స్ రోడ్ నం బర్ 45లోని ప్లాట్ నంబర్ 1355లో నివాసం ఉంటున్నారు. క్రిందటి నెల ఇరవై నాలగవ తేదీన బాలకృష్ణ భార్య,పిల్లలు విదేశీ యాత్రకు వెళ్లారు. ఆ తర్వాత బాలకృష్ణ కూడా గత నెల 30న కుటుంబ సభ్యుల వద్ద కు వెళ్లారు. టూర్ కి వెళ్లేముందు ఇంటికి తాళాలు వేసి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించారు.

బాలకృష్ణ ఇంట్లో స్వల్ప మరమ్మతులు నిర్వహిస్తుండటంతో ఆయన తోడల్లుడు ఎంఆర్‌వీ ప్రసాద్ ఈనెల 6న భార్యతో కలిసి బాలయ్య ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా బెడ్‌రూంలోని డ్రాలో ఉన్న ఆభరణాలు భద్రంగా ఉన్నాయో లేదో చూడాలని వసుంధర ఫోన్‌లోనే తన సోదరిని కోరారు. అయితే బెడ్‌రూంలో వారికి ఆభరణాలు కనపడకపోవటంతో ఇంట్లో చోరీ జరిగినట్లు భావించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది.

చోరీకి గురైన ఆభరణాల్లో బంగారు వడ్డాణం, రూబీ డైమండ్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్, రెండు జతల డైమండ్ చెవి రింగులు, బ్రాస్‌లెట్, ఒమేగా వాచ్, డైమండ్ బ్రాస్‌లెట్ ఉన్నట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. గుర్తు తెలియని వ్యక్తులు లేదా పనిమనుషులు దొంగతనానికి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని డాగ్ స్వ్కాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక రవిచావలి దర్శకత్వంలో శ్రీమన్నారాయణ అనే చిత్రం రెడీ అవుతోంది. మనోజ్ హీరోగా చేస్తున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో  బాలకృష్ణ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.