'చిరు' ఓట్లు పడలేదు

'చిరు' ఓట్లు పడలేదు

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వర్గం ఓట్లు కాంగ్రెసుకు పడలేదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు బుధవారం అన్నారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని మధ్యాహ్నం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఉప ఎన్నికలలో ప్రచారం చేసినప్పటికీ కాపులు తమ పార్టీకి ఓటేయలేదన్నారు.

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఉప ప్రధాని చేయాలని తాను సోనియాకు సూచించానని చెప్పారు. ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డబ్బు, మద్యం, కన్నీళ్లు, సానుభూతి తదితర కారణాల వల్ల ఘన విజయం సాధించిందన్నారు. ఆ కారణంగానే కాంగ్రెసు ఓడిందన్నారు. కులం కూడా ఉప ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు.

కాంగ్రెసు పార్టీకి ఎస్సీలు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ హయాం నుండి అండగా ఉన్నారన్నారు. వారి ఓటు ఎప్పుడూ కాంగ్రెసుకే పడేదన్నారు. ఈ ఉఫ ఎన్నికలలో మాత్రం వారు జగన్ పార్టీకి ఓటేశారని చెప్పారు. సోనియాకు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించానని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ ఎన్నికల తర్వాతనే ఏవైనా మార్పులు ఉంటాయని చెప్పారు.

మార్పులు ఉంటాయని సోనియా గాంధీ తనతో చెప్పారన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అవినీతి మంత్రులను ఇంకా కొనసాగిస్తే 2014 వరకు పార్టీ భవిష్యత్తు కష్టమేనని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తులు నమ్మడం లేదన్నారు.

ఉప ఎన్నికలకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విభజన విషయంలో స్పష్టత ఇవ్వాలని తాము పార్టీ పెద్దలను కలిశామని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. జగన్‌కు వోటేయడం వల్ల కెసిఆర్ వాదం గెలిచినట్లయిందన్నారు. తెలంగాణపై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని తాము అధిష్టానాన్ని కోరామన్నారు. డిసెంబర్ 9న తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అలాంటిది మళ్లీ చేయవద్దన్నారు. అలా అయితే తెలంగాణవాదులు మళ్లీ ఉద్యమ బాట పట్టే అవకాశముందన్నారు. ఆయన కూడా ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిశారు.