తమిళ చిత్రానికి హీరో రామ్ డబ్బింగ్

తమిళ చిత్రానికి హీరో రామ్ డబ్బింగ్

 ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవ్వాల్సి ఉండగా తమిళ వెర్షన్ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడంతో కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేశారు.

ప్రస్తుతం రామ్ తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తమిళంలో ఈచిత్రం ‘ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' అనే పేరుతో విడుదలవుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈచిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈచిత్రంపై తమిళంలో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రం తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం...కథలో లోపమే, సినిమాకు అదే మైనస్ అయింది అంటున్నారు. కరుణాకరన్ టేకింగ్ కూడా ఆకట్టుకోలేదని చర్చించుకుంటున్నారు. కథ విషయం ప్రక్కన పెడితే హీరో రామ్ తన దైన శైలిలో చాలా సీన్స్ లో చక్కగా మెచ్యూరిటీ తో చేసుకుంటూ పోయాడు. తమన్నా రెగ్యులర్ ఎక్సప్రెషన్స్ తో లవ్ సీన్స్ పండించే ప్రయత్నం చేసింది. అయితే సినిమా అంతా ఒకటే డ్రస్ వేసుకుని తమన్నా ఇబ్బంది పెడుతుంది. బ్రహ్మానందం కామెడీ బాగానే పేలినా కథకు సంబంధం లేకుండా పోయింది. డైలాగులు కేవలం కామెడీ సీన్స్ లో మాత్రమే బాగున్నాయి.

అయితే తెలుగులో పెద్దగా విజయం సాధించక పోయినా దర్శక నిర్మాతలు తమిళ వెర్షన్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా తమిళ ప్రేక్షకుల అభిరుచికి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ప్లాపైన సినిమాలు అక్కడ హిట్టయ్యాయి, ఇక్కడ హిట్టయినవి అక్కడ ప్లాపయ్యాయి. ఈచిత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.