అది జగన్ హక్కు: జెత్మలానీ

అది జగన్ హక్కు: జెత్మలానీ

అక్రమాస్తుల కేసులో  వైయస్సార్ కాంగ్రెసు పార్టీఅధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. బుధవారం సిబిఐ వాదనలు అసంపూర్తిగా ముగియడంతో గురువారం కొనసాగాయి. తీర్పును హైకోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదించగా, సిబిఐ తరఫున అశోక్ భాను వాదించారు.

మౌనంగా ఉండడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాంజెత్మలానీ సిబిఐ విచారణలో జగన్ వైఖరిని కోర్టులో సమర్థిస్తూ వాదించారు. తమకు కావాల్సిన సమాధానాలను మాత్రమే జగన్ నుంచి రాబట్టడానికి సిబిఐ ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు.  వైయస్ జగన్ అరెస్టు అక్రమమని ఆయన అన్నారు. ముగ్గురు సాక్షులను వాంగ్మూలం ఇవ్వకుండా బెదిరించారని సిబిఐ ఆరోపిస్తోందని, సిబిఐ మాటలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్టు చేయడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని ఆయన వాదించారు.

ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే విధంగా కుట్ర జరిగిందని, జగన్‌తో కలిసి విజయసాయి రెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డారని సిబిఐ వాదించింది. దర్యాప్తు కొనసాగుతోందని, తమకు అందిన సమాచారం మేరకు దర్యాప్తు సాగుతోందని చెప్పింది. కేసు కీలక దశలో ఉన్నందున జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, తమ విచారణలో జగన్ సహకరించలేదని అన్నారు. తమకు సహకరించకపోవడం వల్లనే జగన్ బయట ఉంటే ప్రమాదమని గుర్తించామని సిబిఐ వాదించింది.

జగన్ పారిపోయే అవకాశం లేదని, దురుద్దేశంతోనే ఉప ఎన్నికల సమయంలో సిబిఐ జగన్‌ను అరెస్టు చేసిందని జెత్మలానీ అన్నారు. జగన్ ఇప్పటి వరకు ఎవరినీ బెదిరించలేదని, బెదిరిస్తారనే సూచనలు కూడా లేవని ఆయన అన్నారు. ఎంపి అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వకూడదనేది ఎక్కడా లేదని ఆయన అన్నారు. ఎంపిగా, ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి జగన్ ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని, సిబిఐ దర్యాప్తునకు జగన్ సహకరిస్తారని జెత్మలానీ చెప్పారు.