విశాఖ ఉక్కులో అగ్ని ప్రమాదం

విశాఖ ఉక్కులో అగ్ని ప్రమాదం

విశాఖ ఉక్కు కర్మాగారంలోని కొత్తగా నిర్మించిన ఎస్ఎంఎస్ -2లో ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. మృతుల్లో జీఎం, ముగ్గురు డీజీఎంలు కూడా ఉన్నారు. ఆరుగురి ఆచూకీ తెలియడంలేదు. ఆస్పత్రిలో 9 మంది 90 నుంచి వంద శాతం వరకు కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంటును విస్తరించి, దీని సామర్థ్యాన్ని మరింత పెంచాలనే ప్రణాళికలో భాగంగా కొత్తగా మరో స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్-2) ఏర్పాటు చేశారు. అతి త్వరలో దీనిని ప్రారంభించాల్సి ఉంది. బుధవారం రాత్రి దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఎస్ఎంఎస్-2 కన్వర్టర్ బ్లోయింగ్‌కు అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు పక్కనే ఒక ప్రత్యేకమైన ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు.

కన్వర్టర్ బ్లోయింగ్‌కు అవసరమైనంత ఒత్తిడి (ప్రెజర్)తో ఆక్సిజన్ రాలేదు. దీంతో కొందరు అధికారులు ఆక్సిజన్ సిలెండర్ల వద్దకు వెళ్లి ప్రెజర్‌ను పెంచారు. అయినా ప్రెజర్ రాలేదని వారు కన్వర్టర్ వద్ద ఉన్న సిబ్బందికి చెప్పారు. దీంతో ప్రెజర్ మళ్లీ పెంచారు. ఇంకోసారీ పెంచారు. ఇలా మూడుసార్లు పెంచడంతో సిలిండర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ విడుదల కావడంతో 20 మీటర్ల ఎత్తు, ఐదు మీటర్ల వ్యాసం ఉన్న ఆరు సిలెండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. మంటలు ఎగిసిపడ్డాయి. కలకలం చెలరేగింది. విశాఖ ఉక్కు చరిత్రలో పెను విషాదం నమోదైంది.

ప్రమాద సమయంలో ప్రాజెక్ట్స్ జీఎం కల్సి, ముగ్గురు డీజీఎంలతోసహా సుమారు 28 మంది అక్కడ ఉన్నట్లు తెలిసింది. వీరిలో జీఎం, ముగ్గురు డీజీఎంలు ప్రమాదంలో మరణించారు. వేడి తీవ్రతకు బాధితుల వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయి. ఆరుగురు సంఘటన స్థలంలోనే చనిపోయారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. గాయపడిన వారికి స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో, విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చేర్చారు. మృతిచెందినట్టుగా భావిస్తున్నవారిలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను 'సీమేడ్' కంపెనీకి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అప్పగించింది.

ఆక్సిజన్ ప్లాంట్‌ను పూర్తిగా సిద్ధం చేసి గురువారం అందజేయాల్సి ఉంది. మృతులు, క్షతగాత్రుల్లో సీమేడ్ కంపెనీ సిబ్బంది కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విస్తరణ పనులను రూ.12,500 కోట్లతో చేపట్టారు. ఎస్ఎంస్-2ను 6.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌హౌస్-2లోనే పేలుడు సంభవించింది. దీంతో విశాఖ స్టీల్ విస్తరణకు తీవ్ర విఘాతం కలిగినట్లే అని అధికారులు చెబుతున్నారు.

కార్మికులకు భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. జరిగిన ప్రమాదం విషయాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని ఆయన ఆదేశించారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

స్టీలు ప్లాంటు ప్రమాదంలో ఆరుగురి ఆచూకీ గల్లంతైనట్లు ప్రాజెక్టుల డైరెక్టర్ ఎన్ఎస్ రావు బుధవారం రాత్రి ప్రకటించారు. వీరిలో డీజీఎంలు కమలాకర్, శ్రీహరి, ఇంకా.. మురళీధర్‌రాజు (ఆఫీసర్), అతుల్ (మేనేజ్‌మెంట్ ట్రైనీ), ప్రభాకర్ (డిప్యూటీ మేనేజర్), సత్యనారాయణ (సీనియర్ ఫోర్‌మన్), నారాయణ (ఫోర్‌మన్)ల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని ఆయన తెలిపారు.