మోపిదేవి,జగన్ మధ్య చనువు పెరిగింది

 మోపిదేవి,జగన్ మధ్య చనువు పెరిగింది

 అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణతో జైలులో ఖాళీ సమయాలలో షటిల్ ఆడుతున్నారట. జైలులో ఉన్న జగన్, మోపిదేవి మొదట్లో ముభావంగానే ఉన్నారట. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య చనువు పెరిగిందని తెలుస్తోంది. రోజూ ఉదయ మోపిదేవి, జగన్ ఇద్దరూ కలిసి తోటి విఐపి ఖైదీలతో షటిల్ ఆడుతున్నట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు వీరిద్దరూ నిత్యం పలు అంశాలపై చర్చించుకుంటున్నారట. మోపిదివి జైలుకు వచ్చిన సమయంలో స్వల్ప అస్వస్థతతో ఉన్నప్పటికీ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. గత నెల 27న వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు రాత్రి కోఠిలోని సిబిఐ కార్యాలయంలోనే అతనిని ఉంచారు. 28న కోర్టులో హాజరు పర్చారు. అతనిని కోర్టు జ్యూడిషియల్ రిమాండుకు తరలించడంతో చంచల్‌గూడ జైలుకు పంపించారు.

మొదట్లో జగన్ ఒంటరిగా ముభావంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత్తర్వాత కాస్త తేరుకొని తోటి ఖైదీ సునీల్ రెడ్డితో షటిల్ ఆడటం, అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడటం చేశారు. మొదట బ్రెడ్, చపాతీలు తీసుకున్నారు. టీలు ఎక్కువగా తాగారు. కోర్టు అతనిని సిబిఐ కస్టడీకి అనుమతించడంతో ఆదివారం నుండి సిబిఐ అతనిని విచారిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా కేర్ నుండి డిశ్చార్జ్ చేశాక చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆయన కూడా అక్కడ మొదట్లో ముభావంగానే ఉన్నారట. ఆ తర్వాత ఆయన క్రమంగా తేరుకొన్నారు. ఇప్పుడు జగన్‌తో కలిసి షటిల్ ఆడుతున్నారట. కాగా ఉదయం పదిన్నర గంటలకు జగన్‌ను సిబిఐ తమ కస్టడీకి తీసుకుంటుంది. ఐదు రోజుల కస్టడీలో మంగళవారం మూడో రోజు విచారణ జరగనుంది.