విజయమ్మ రోడ్ షోలపై సోనియా ఆరా

విజయమ్మ రోడ్ షోలపై సోనియా ఆరా

 వైయస్ జగన్ జైలు పాలైన తర్వాత  వైయస్ విజయమ్మ , ఆమె  కూతురు షర్మిల నిర్వహిస్తున్న రోడ్ షోల తీరుపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సానుభూతి వైయస్సార్ కాంగ్రెసుకు ఓట్లుగా మారితే ప్రమాదమనే ఆందోళన శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కోర్ కమిటీలో చివరలోనైనా అయినా సీరియస్‌గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అక్రమాలు, అవినీతి ఆరోపణలపై వైయస్ జగన్ జైలు పాలైన తర్వాత కూడా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసి, అటు వైపు వెళ్లడంపై సమావేశంలో చర్చ జరిగిందని అంటున్నారు. 

పార్టీ శాసనసభ్యులు జగన్ వైపు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, ప్రభుత్వాధినేతకు ముందే హెచ్చరించామని గుర్తు చేస్తూ ఎందుకు ఆపలేకపోయారని సోనియా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను జగన్ గెలుచుకున్న అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న కోర్ కమిటీలో వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో మున్ముందు మరిన్ని కష్టాలు ఎదురు కావచ్చునని అభిప్రాయపడుతూ, ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పరిశీలనకు వచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై కోర్ కమిటీలో తీవ్ర ఆందోళన వ్యక్తమైందని చెబుతున్నారు. 

ప్రధాని మన్మోహన్ సింగ్‌పై పౌర సమాజం నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి, పెట్రోలు ధర పెంపు మూలంగా ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనను ఎలా ఎదుర్కోవాలి, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య పెరగకుండా చూసేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశాలపై కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం చర్చించింది. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీలతో పాటు రక్షణ మంత్రి ఏకె ఆంటోని, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి చిదంబరం, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై ఏ విధమైన విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారని అంటున్నారు. అన్నాహజారే బృందం యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకే మన్మోహన్ సింగ్‌పై ఆరోపణలు చేస్తోందనే అభిప్రాయానికి సమావేశం వచ్చినట్లు చెబుతున్నారు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ అవినీతికి పాల్పడ్డారంటూ అన్నాహజారే బృందం చేసిన ఆరోపణలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలన్న సిఎజి అభిప్రాయంపైనా కోర్ కమిటీ చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పెట్రోలు ధర ఒకేసారి లీటరుకు ఏడున్నర రూపాయలు పెంచేందుకు దారి తీసిన పరిస్థితులపై సోనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. పెట్రోలియం సంస్థలు ప్రభుత్వంతో చర్చించకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాయని సోనియా ప్రశ్నించినట్టు ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తొందరపాటు వల్ల ప్రతిపక్షానికి అస్త్రాన్ని అందించినట్లయిందనే అభిప్రాయం కోర్ కమిటీలో వ్యక్తమైందని అంటున్నారు.