నాయకత్వ మార్పుపై పుకార్లు

నాయకత్వ మార్పుపై పుకార్లు

తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెసులో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కోరికను అధిష్టానం నెరవేరుస్తుందని ఆయన మంగళవారం అన్నారు. 2014 ఎన్నికలకు చిరంజీవి తమ నాయకుడని ఆయన అన్నారు. 2014లో చిరంజీవి నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని, చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. కలిసికట్టుగా పనిచేసి చిరంజీవిని ముఖ్యమంత్రిని చేద్దామని కూడా ఆయన అన్నారు.

అదే సమయంలో రాష్ట్ర పార్టీని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మారుస్తారా, లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తూ పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ స్థానంలో చిరంజీవిని నియమిస్తారా అనేది తెలియడం లేదు. వీరిద్దరిపైన చిరంజీవిని పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. పలువురు నాయకులు మంగళవారం అధిష్టానం పెద్దలను కలిశారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదనే అభిప్రాయాన్నే ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి - ముఖ్యమంత్రి మార్పు ఉండదనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం కూడా మిస్టరీగానే ఉంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్న తర్వాత హస్తినలో రాజకీయం వేడెక్కింది. గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. తాను సోనియాకు ఏ విధమైన నివేదికలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక్క స్పష్టమైన చిత్రాన్ని సోనియా ముందు ఉంచినట్లు భావిస్తున్నారు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభావం, తెలంగాణ అంశం, దిగజారిన పార్టీ పరిస్థితిపై కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలను తెప్పించుకున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి, పిసిసి అధ్యక్షుడి నుంచి అధిష్టానం వివరమైన నివేదికలను తీసుకుంది. అదే సమయంలో రాష్ట్రానికి చెందిన నాయకులను ఒక్కరొక్కరినే ఢిల్లీకి పిలిపించుకుంటోంది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, పితాని సత్యనారాయణ కూడా ఢిల్లీలో ఉన్నారు. నాయకత్వ మార్పుపై సోనియా మాట్లాడలేదని ఆమెను కలిసిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు.

ఇదిలావుంటే, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. వైయస్ జగన్ అరెస్టుతో తమ పార్టీ ఉప ఎన్నికల్లో నష్టపోయిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ విధమైన మార్పులైనా ఉండవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు మంగళవారం చెప్పారు. అంటే, తెలంగాణ ఏర్పాటుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కాంగ్రెసు ఎంపిల మాటలను విశ్వసించే పరిస్థితి కూడా లేదు. వారు ఎప్పటికప్పుడు అటువంటి మాటలే చెబుతూ వస్తున్నారు. మొత్తం మీద, చిరంజీవి రాష్ట్ర కాంగ్రెసులో కీలకమైన భూమికను పోషించే అవకాశాలున్నట్లు మాత్రం ఉందని అంటున్నారు.